
హోమ్ గార్డుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ:
హోమ్ గార్డుల పోస్టుల భర్తీకై ఏపీ సీఐడీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ సీఐడీ విభాగంలో 28 హోమ్ గార్డుల పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన మహిళా, పురుష అభ్యర్థులు మే 1 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇందుకు 18 నుండి 50 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 18 నుండి 50 సంవత్సరాలు ఉండాలి. https://cid.appolice.gov.in నందు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 94407 00860 (ఆఫీస్ పని వేళల్లో).
ఏపీ రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఖరారు:
ఏపీ రాజ్యసభ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఖరారు అయ్యారు. రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంకట సత్యనారాయణ పేరును ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. భీమవరంకు చెందిన సత్యనారాయణ.. ప్రస్తుతం ఏపీ బీజేపీ డిసిప్లీనరీ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. తమిళనాడుకు చెందిన అన్నామలై, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ పేర్లు రేసులో వినిపించినా.. చివరకు సత్యనారాయణకు అవకాశం దక్కింది. ఇటీవల విజయసాయి రెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఓ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం భర్తీపై ఉత్కంఠ కొనసాగింది. తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైతో భర్తీ చేస్తారని రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ జరిగింది. తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగింది. చివరకు పాకా వెంకట సత్యనారాయణ పేరును ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
మాజీ మంత్రి కేటీఆర్‌కు గాయం;
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు గాయమైంది. జిమ్ వర్కౌట్ సెషన్‌లో స్లిప్ డిస్క్ గాయం అయినట్లు కేటీఆర్ తెలిపారు. కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. వైద్యుల సలహా మేరకు రెస్ట్ తీసుకొని త్వరలో తిరిగి వస్తానని ఆశిస్తున్నాను అంటూ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. త్వరగా కోలుకోవాలంటూ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నారు.
కర్రెగుట్ట ఆపరేషన్స్‌లో టీజీ పోలీసులు పాత్ర లేదు:
మావోయిస్టు పార్టీ లో ఉన్న తెలంగాణ వాసులందరూ లొంగిపోవాలని మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు.. తెలంగాణ పోలీసులు కర్రెగుట్టలో ఎలాంటి ఆపరేషన్స్ నిర్వహించట్లేదని స్పష్టం చేశారు.. కేంద్ర బలగాల నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశారు.. వెంకటాపురం ఏరియాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకొని కేంద్ర బలగలు మోహరించి ఆపరేషన్ నిర్వహిస్తున్నారన్నారు.. తెలంగాణలో ఎలాంటి మావోయిస్టుల కదలికలు లేవని తెలిపారు.. శాంతి చర్చలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఉందని చెప్పారు. మావోయిస్టులు లొంగిపోతే పారితోషకం, రివార్డులు వెంటనే ఇస్తున్నామని గుర్తు చేశారు.. వాళ్లకి ఉపాధి కల్పించేలా చేస్తామని హామీ ఇచ్చారు..
ఏసీ కోచ్ నుండి దిగి ప్లాట్‌ఫారమ్ పై కుర్చున్న దొంగలు:
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), GRP సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు నేరస్థులను అరెస్టు చేశారు. ఈ నిందితులు దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో రైల్వే ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చారు. కానీ, పోలీసులు సకాలంలో చర్య కారణంగా వారి ప్రణాళిక విఫలమైంది. అందిన సమాచారం ప్రకారం, ఈ సంఘటన హౌరాలోని ప్లాట్‌ఫారమ్ నెం. 1 లో జరిగింది. అక్కడ ముగ్గురు AC కోచ్ నుండి దిగి కూర్చున్నారు. వారి కార్యకలాపాలను చూసిన GRP సభ్యులు, ఈ వ్యక్తులు AC కోచ్ నుండి దిగిన వారు చెమటతో తడిసిపోయారని గమనించారు. AC కోచ్‌లో ఎటువంటి లోపం లేకపోవడంతో GRP వారిని విచారించారు. దర్యాప్తులో ముగ్గురి చేతుల్లో రెండు మొబైల్ ఫోన్లు ఉన్నాయని తేలింది. దీనిని గమనించిన GRP వారిని అదుపులోకి తీసుకుంది.
భారత్తో వైరం వద్దు:
పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిస్థితులను దౌత్య మార్గంలో పరిష్కరించుకోవాలని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించాడు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడానికి ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని తన సోదరుడైన, ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు సూచించినట్లు పలు వార్త కథనాలు వస్తున్నాయి. నవాజ్ నివాసంలో వీరి మధ్య జరిగిన సమావేశంలో ఈ విషయం చెప్పినట్లు తెలుస్తుంది. కాగా, పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన టూరిస్టులపై ఉగ్రవాదులు జరిపిన ఘటనలో 26 మంది చనిపోయారు. దీంతో భారత్, పాక్‌ల మధ్య విభేదాలు ఒక్కసారిగా చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తో దౌత్య సంబంధాలపై భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో దాయాది దేశం కూడ సిమ్లా ఒప్పందంతో పాటు తమ గగనతలంలో భారత్‌కు చెందిన విమానాలకు అనుమతిని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.
పాక్‌తో పాటు బంగ్లాదేశ్‌పై కూడా చర్యలు:
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్‌పై కఠినమైన చర్యలు విధిస్తుంది. ఈ నేపథ్యంలో పాక్ కు దగ్గర అవుతున్న బంగ్లాదేశ్‌పై కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఈశాన్య భారతదేశంలోని కీలక రాజకీయ నాయకులు, పలు పార్టీలు పిలుపునిచ్చాయి. అయితే పాక్- బంగ్లాదేశ్ మధ్య సన్నిహిత సంబంధాల గురించి అధికారులను అప్రమత్తం చేసినట్లు గత వారం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఆ తర్వాత కొన్ని రోజులకే పహల్గామ్ లో ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఈ ఉగ్రదాడి తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ తో లష్కరే తోయిబా నేతలు సమావేశం కావడం గమనార్హం.
భారత్ దెబ్బకు పాకిస్థాన్ మార్కెట్ కుదేలు:
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికే దారుణంగా ఉంది. తీవ్ర నగదు కొరత, ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లుతోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పలు ఆంక్షలు విధించడంతో పాక్ పరిస్థితి మరింత దిగజారింది. భారత్‌తో ఖయ్యానికి కాలు దువ్వుతున్న తరుణంలో ఆ దేశ ద్రవ్యోల్బణం కొండెక్కింది. ఇప్పటికే ఆహార పదార్ధాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ చికెన్ ధర దాదాపు రూ. 800లకు చేరుకుంది. పాక్ ప్రజలు దారిద్ర్యం అనుభవిస్తున్నారు. ముందు ఇల్లు చక్కబెట్టుకోవడం మర్చిపోయి భారత్‌పై కారాలు మిరియాలు నూరుతోంది. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సూత్రం ఇప్పుడు పాకిస్థాన్ కు బాగా అబ్బుతుంది. పాకిస్థాన్‌లో ప్రస్తుతం కొన్ని ఆహార పదార్థాల ధరల గురించి తెలుసుకుందాం. కిలో చికెన్: 798.89 పాకిస్థాన్ రూపాయలు, కిలో బియ్యం: 339.56 పాకిస్థాన్ రూపాయలు, డజను గుడ్లు: 332 పాకిస్థాన్ రూపాయలుగా ఉంది.
స్పెయిన్, పోర్చుగల్‌లో నిలిచిన విద్యుత్ సరఫరా:
యూరప్ దేశాలైన స్పెయిన్, పోర్చుగల్‌తో పాటు ఫ్రాన్స్‌లోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. దీంతో లక్షలాది మంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేస్తుంది. అయితే, యూరోపియన్ విద్యుత్ గ్రిడ్‌లో సమస్య ఏర్పడటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ అంశంపై రెడ్ ఎలక్ట్రికా సంస్థ రియాక్ట్ అయింది. విద్యుత్ సరఫరాను త్వరలోనే పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమస్యకు కారణమేంటనే అంశాన్ని విశ్లేషిస్తున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్:
జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో నేడు (సోమవారం) రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతోంది. రాజస్థాన్‌కు ప్లేఆఫ్ ఆశలు నిలబడాలంటే ఈ మ్యాచ్ కీలకం. ఇకపోతే, నేటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో రెండు మార్పులు చేసింది. ఫజల్‌హాక్ ఫరూకీ, తుషార్ దేశ్‌పాండే స్థానంలో మెహష్ తీక్ష్ణ, యుధ్వీర్ సింగ్ చరక్‌లు చోటు దక్కించుకున్నారు. గుజరాత్ కరీం జనత్ కు ఐపీఎల్ లో అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. ఈరోజు గుజరాత్ చేతిలో రాజస్థాన్ ఓడిపోతే, ప్లేఆఫ్ ఆశలు పూర్తిగా ఆవిరైపోతాయి. ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆర్‌ఆర్ ఏడు ఓడిపోయింది. గత ఐదు మ్యాచ్‌ల్లో RR వరుస పరాజయాలను చవిచూసింది. దానితో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. అయితే, సొంతగడ్డపై గుజరాత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని రాజస్థాన్ చూస్తోంది. ప్రస్తుత సీజన్‌లో అహ్మదాబాద్‌లో ఈ ఇరు జట్లు తలపడినప్పుడు, గుజరాత్ 58 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్, 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పట్టికలో రెండవ స్థానంలో ఉంది. గుజరాత్ మరో విజయం సాధిస్తే ప్లేఆఫ్ స్థానాన్ని ఖరారు కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుజరాత్ ఖాతాలో ప్రస్తుతం 12 పాయింట్లు ఉన్నాయి. ఇక నేటి ఇరుజట్ల ప్లేయింగ్ XI ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
మైదానంలో అతడి కాళ్లు మొక్కిన కోహ్లీ:
న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన డీసీ, ఆర్సీబీ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ హాజరయ్యారు. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చిన రాజ్‌కుమార్.. కోహ్లీని కలిశారు. కోచ్ రాకను గమనించిన విరాట్.. అతని కాళ్లను మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆపై కోహ్లీని హగ్ చేసుకున్న ఆయన.. ప్రత్యేకంగా అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కోచ్ పట్ల మర్యాద, గౌరవం చూపిన కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదే’, ‘కోహ్లీ చూసి కుర్రాళ్లు నేర్చుకోవాలి’, ‘విరాట్ నిరాడంబరతకి ఇదే నిదర్శనం’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ప్రవస్తిపై గీతా మాధురి సంచలన కామెంట్స్:
టాలీవుడ్ లో సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. కీరవాణి, సునీతపై ఆమె చేసిన ఆరోపణలపై ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. తాజాగా స్టార్ సింగర్ గీతా మాధురి వీడియో రిలీజ్ చేసింది. ‘సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు చూసి చాలా బాధేసింది. ఆమె చాలా మెంటల్ ప్రెషర్ లో ఉంది. ఇప్పటికే ఆమె చాలా కాంపిటీషన్స్ లో పాడింది. కాబట్టి ఆమెపై చాలా మెంటల్ ప్రెషర్ పెరిగి అలా మాట్లాడి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ప్రవస్తి ఒక షోలో గెలవనంత మాత్రాన నీ పని అయిపోయినట్టు కాదు. దాన్ని గుర్తు పెట్టుకో. ప్రతి దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు. నీ హార్ట్ లోకి తీసుకుని ఇలా మాట్లాడొద్దు.
పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణ:
నందమూరి నటసింహం బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు ఆయన పంచెకట్టులో వెళ్లి అబ్బుపరిచారు. సినీరంగంలో విశేషంగా సేవలు అందించినందుకు గాను బాలకృష్ణకు పద్మభూషన్ ప్రకటించింది కేంద్రం. తాజాగా ఈ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ వేడుకకు బాలకృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా తరలి వెళ్లారు.
బాహుబలి రీరిలీజ్.. ఎప్పుడంటే..?:
తెలుగు సినిమా చరిత్రనే తిరగరాసిన మూవీ. ఇండియన్ మూవీ స్థాయిని పెంచేసిన సినిమా. అదే బాహుబలి. ఇండియన్ సినిమా చరిత్రలో బాహుబలికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా మూవీ టీమ్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. బాహుబలిని రీరిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ లోనే థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ సారి కొత్త సీన్లు కూడా ఇందులో యాడ్ చేస్తున్నారంట. మనం చూడని కొన్ని ఎడిట్ చేసిన సీన్లతో పాటు, అన్ సీన్ ఫుటేజ్ ను చూపించబోతున్నారంట. కానీ అవేంటి అనేది ప్రస్తుతానికి ప్రకటించలేదు.