
Ready to War: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి భారత దేశాన్ని కుదిపేసింది. ఈ ఘటన తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. సోషల్ మీడియాలో యుద్ధం గురించి చర్చలు ఊపందుకున్నాయి. ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ, యుద్ధం అంత సులభమా? ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం సాధ్యమా?
పహల్గామ్ దాడి తర్వాత భారత ప్రజలలో ఆగ్రహం పెల్లుబికుతోంది. పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పాలంటూ చాలా మంది గళమెత్తుతున్నారు. ఓర్పు, సహనం ఇక చాలని.. వన్స్ ఫర్ ఆల్.. బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా ఊపందుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే భారత్ ఇప్పటికే దౌత్యపరమైన చర్యలు చేపట్టింది. సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అట్టారీ-వాఘా చెక్‌పోస్ట్ మూసివేసింది. పాకిస్తానీలకు వీసాలు నిలిపేసింది. కానీ ఇప్పటివరకూ సైనిక చర్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పరిస్థితులను అంచనా వేస్తోంది. మరోవైపు.. ఈ దాడితో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయిస్తోంది. భారత్ మాత్రం దీనిని నమ్మడం లేదు. 2016లో యూరీ దాడి, 2019లో పుల్వామా దాడి తర్వాత భారత్ సర్జికల్ స్ట్రైక్‌లు, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్‌లతో స్పందించింది. అయితే ఇప్పుడు అలాంటివి సరిపోవని.. యుద్ధం చేయాల్సిందేననే వాళ్ల సంఖ్య పెరుగుతోంది.
పహల్గామ్ దాడి తర్వాత భారత్ సైనిక సన్నాహాలను ముమ్మరం చేసింది. సుఖోయ్-30, రాఫెల్, మిరాజ్-2000 వంటి యుద్ధ విమానాలను సిద్ధంగా ఉంచింది. అటు పాకిస్తాన్ కూడా సరిహద్దులకు యుద్ధ విమానాలను, సైన్యాన్ని తరలిస్తోంది. అయితే యుద్ధం సాధ్యమా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇందుకు అనేక అంశాలు దోహదపడాలి. అందులో మొదటిది అంతర్జాతీయ మద్దతు. పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్ పై G20 దేశాలకు భారత్ సమాచారమిచ్చింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మద్దతు కోరింది. సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్ వంటి దేశాలు కూడా భారత్‌కు సంఘీభావం ప్రకటించాయి. పాకిస్తాన్‌కు బహిరంగ మద్దతు ఇచ్చే దేశాలు తక్కువ. చైనా, టర్కీ వంటి దేశాలు పాకిస్తాన్ కు అనుకూలంగా ఉన్నా.. ఈ అంశంలో తటస్థంగా వ్యవహరించవచ్చు. లేదంటే పరోక్షంగా మద్దతివ్వొచ్చు. రెండోది -అణ్వాయుధ ప్రమాదం. రెండు దేశాల మధ్య అణ్వాయుధాలున్నాయి. కాబట్టి యుద్ధం జరిగితే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపిస్తుంది. మూడోది – ఆర్థిక, రాజకీయ ఒత్తిడి: భారత్ ఇప్పటికే దౌత్యపరంగానే కాక ఆర్థిక ఆంక్షలతో పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచింది. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం లేకుండా పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ మార్గాలు ఎంతో దోహదపడతాయి.
పహల్గాం దాడి తర్వాత భారత్ చేపట్టిన చర్యలు పాకిస్తాన్ కు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అయినా పాకిస్తాన్ దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తే మాత్రం యుద్ధం వరకూ పరిస్థితులు వెళ్లే అవకాశం ఉంది. దౌత్యపరమైన ఆంక్షల ద్వారా భారత్ ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టింది. అటు పాకిస్తాన్ కూడా భారత్ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అయితే ఇవి మరింత ముదిరి యుద్ధం వరకూ వెళ్లాలంటే మరికొన్ని అంశాలు దోహదపడాలి. అందులో మొదటిది తీవ్రమైన ఉగ్రవాద దాడులు. పహల్గామ్ టెర్రర్ ఎటాక్ తో ఇప్పటికే భారతీయల రక్తం మరుగుతోంది. అయినా టెర్రరిస్టులు వెనక్కు తగ్గకుండా మున్ముందు కూడా దాడులు కంటిన్యూ చేస్తే యుద్ధం రావడం ఖాయం. ఈ దాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ప్రత్యక్షంగానో, పరోక్షంగానే ఉందని నిర్ధారణ అయితే సైనిక చర్యలకు భారత ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో వెనకాడదు. రెండోది సరిహద్దు ఉద్రిక్తతలు. పహల్గాం ఎటాక్ తర్వాత నియంత్రణ రేఖ- LoC వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించింది. కాల్పులు, దాడులకు పాల్పడుతోంది. మరోవైపు భారత్ కూడా దీటుగా స్పందిస్తోంది. ఈ పరిస్థితి కంటిన్యూ అయితే అవి యుద్ధానికి దారితీస్తాయి. మూడోది – దౌత్య సంబంధాల వైఫల్యం. సింధూ జలాల ఒప్పందం రద్దు, రాయబార కార్యాలయ సిబ్బంది తగ్గింపు వంటి చర్యలతో దౌత్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయని చెప్పొచ్చు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అయితే అవి యుద్ధానికి దారి తీయొచ్చు. నాలుగోది అంతర్జాతీయ ఒత్తిడి. అమెరికా, రష్యా వంటి దేశాలు భారత్‌కు మద్దతిచ్చినా, చైనా లేదా ఇతర దేశాలు పాకిస్తాన్‌కు మద్దతిస్తాయి. భారత్ – పాకిస్తాన్ మధ్య ఇతర దేశాలు జోక్యం చేసుకుంటే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఐదోది – అంతర్గత రాజకీయ ఒత్తిడి. పహల్గాం ఎటాక్ ను భారత ప్రజలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. యుద్ధం చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ప్రజల ఆగ్రహాన్ని శాంతింపజేయడం ప్రభుత్వ బాధ్యత ఒకవేళ ప్రజల ఆగ్రహాన్ని, రాజకీయ పార్టీల ఒత్తిడిని తట్టుకునేందుకు ప్రభుత్వం యుద్ధానికి దిగొచ్చు.
యుద్ధం అంటే రాత్రికి రాత్రి చేసేది కాదు. ఇందుకోసం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం తెరవెనుక పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. యుద్ధానికి భారీ కసరత్తే చేయాల్సి ఉంటుంది. ఒత్తిడికి తలొగ్గో.. లేకుంటే ఎవరి మనోభావాలనో సంతృప్తి పరిచేందుకు యుద్ధరంగంలోకి దిగితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే యుద్ధానికి దిగేముందు అనేక అంశాలను గుర్తుంచుకోవాలి. అందులో మొదటిది- సైనిక సన్నద్ధత. సరిహద్దుల్లో భారత ప్రభుత్వం సైనిక సంఖ్యను పెంచుతోంది. యుద్ధ విమానాలు, క్షిపణులు, ట్యాంకులను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే రాఫెల్, సుఖోయ్ విమానాలు సరిహద్దులకు చేరుకున్నాయి. అటు పాకిస్తాన్ కూడా వైమానిక రక్షణ వ్యవస్థలను అప్రమత్తం చేసింది. రెండోది – గూఢచార సమాచారం: ఉగ్రవాద స్థావరాలు, పాకిస్తాన్ సైనిక కదలికలపై ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ సేకరణ చాలా కీలకం. భారత్ ఇప్పటికే ఉధంపూర్, డూడు వంటి ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్‌లు చేపట్టింది. మూడోది – దౌత్యపరమైన కసరత్తు: అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ను ఒంటరిని చేసేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. G20 దేశాలతో సమావేశాలు నిర్వహించడం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చలు జరపడం ఇందులో భాగమే. నాలుగోది – ఆర్థిక సన్నాహాలు. యుద్ధం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇంధన నిల్వలు, ఆయుధ సరఫరా, ఆర్థిక అవసరాలను భారత్ బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. ఐదోది – ప్రజల మద్దతు. పహల్గామ్ దాడి తర్వాత ప్రజలలో ఆగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు యుద్ధాన్నే కోరుకుంటున్నారు. కానీ యుద్ధం దీర్ఘకాల పరిణామాలను ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఒకవేళ యుద్ధం తప్పకపోతే మాత్రం దాని పరిణామాలు భారీగనే ఉండే అవకాశం ఉంది. అత్యంత ఆధునిక ఆయుధాలతో జరిగే ఈ యుద్ధం కొన్ని తరాలపాటు ప్రభావం చూపించడం ఖాయం. ఒకవేళ భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్ధం తప్పకపోతే మానవ నష్టం భారీగా ఉంటుంది. రెండు దేశాల్లోనూ వేలాది మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోవచ్చు. యుద్ధం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేస్తుంది. పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఆ దేశానికి పెద్దగా పోయదేం ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడిప్పుడే భారత్ ఎదుగుతోంది. అగ్రరాజ్యాలతో పోటీ పడగలుగుతోంది. త్వరలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధానికి దిగితే భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. మన టార్గెట్ ను రీచ్ కాలేకపోవచ్చు. ఇక రెండూ అణ్వాయుధ దేశాలు కాబట్టి.. యుద్ధంలో అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు జోక్యం చేసుకోవచ్చు. అన్నిటికీ మించి దక్షిణాసియాలో శాంతి దెబ్బతింటుంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వంటి పొరుగు దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
యుద్ధ పరిణామాల గురించి తెలిసిన వాళ్లు దాని జోలికి వెళ్లొద్దనే చెప్తుంటారు. నిత్యం యుద్ధకాంక్షతో రగిలిపోయిన ఎన్నో దేశాల్లో ఇప్పుడు ఆకలిచావులు కనిపిస్తున్నాయి. అందుకే యుద్ధం కంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలనే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతోంది. యుద్ధం కంటే తక్కువ నష్టంతో ప్రతీకారం తీర్చుకునే మార్గాలు ఇప్పుడు చాలానే ఉన్నాయి. ఇందులో మొదటిది సర్జికల్ స్ట్రైక్స్.. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా భారత్ సత్తా చాటింది. ఇప్పుడు కూడా కేవలం టెర్రరిస్టులను, వాళ్లకు ఆశ్రయం కల్పిస్తున్న వాళ్లను టార్గెట్ గా చేసుకుని స్ట్రైక్స్ చేయొచ్చు. దీని వల్ల పెద్దగా ఆస్తి, ప్రాణనష్టం ఉండదు. రెండోది సైబర్ ఎటాక్స్. ప్రస్తుతం ప్రపంచంలో సైబర్ ఎటాక్స్ ఏ స్థాయిలో నష్టం కలిగిస్తున్నాయో చూస్తున్నాం. పాకిస్తాన్ ఆర్థిక, సైనిక వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ ఎటాక్స్ చేయడం ద్వారా దారికి తెచ్చుకునే అవకాశం ఉంది. ఇలాంటి విషయాల్లో ఇజ్రాయెల్ తరహా స్ట్రాటజీని అవలంబించడం బెటర్. మూడోది ఆర్థిక ఆంక్షలు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలు విధించవచ్చు. చివరిది దౌత్యపరమైన ఒత్తిడి. అంతర్జాతీయ సమాజం దృష్టిలో పాకిస్తాన్ పన్నాగాలను ఎండగట్టడం ద్వారా ఏకాకిని చేయొచ్చు. అయితే అన్ని దేశాలూ ఇందుకు కలసి వస్తాయని ఆశించలేం.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రజలలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కానీ యుద్ధం అంత సులభమైన నిర్ణయం కాదు. అణ్వాయుధ శక్తులుగా ఉన్న ఇరు దేశాలూ యుద్ధం విషయంలో ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. ఒకవేళ పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోకపోతే మాత్రం భారత్ చివరి అస్త్రంగా యుద్ధరంగంలోకి దిగొచ్చు.