Premature Rains: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షం.. అపార నష్టం – Telugu Information | Rains wash away hopes of Andhra Telangana farmers

Written by RAJU

Published on:

ఆరుగాలం కష్టమంతా వృధా అయింది. రాత్రింబవళ్లు పడిన శ్రమంతా నీటిపాలైంది. అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టాన్ని మిగిల్చింది. వరణుడి ప్రకోపం.. రైతులకు తీరని శోకాన్ని కలిగించింది. తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు భానుడి భగభగలతో ప్రజలు ఉక్కపోతకు గురవుతుంటే.. మరోవైపు ఈదురుగాలతో కూడిన వడగళ్ల వర్షాలు రైతుల్ని దెబ్బతీస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట పనికి రాకుండా పోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

నాగర్ కర్నూల్ జిల్లాలో మామిడి రైతులను అకాల వర్షాలు కోలుకోలేని దెబ్బ తీశాయి. అచ్చంపేట మండలం లింగోటంలో మామిడి కాయలు రాలిపోయాయి. పంట చేతికొచ్చే సమయంలో కాయలన్నీ నేలరాలడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. మరోవైపు కోతకు వచ్చిన వరి నేలవాలగా, కళ్లాల్లో ఆరబోసిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. అప్పులు చేసి పంటకు పెట్టుబడిగా పెడితే.. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతన్నలు వాపోతున్నారు.

వరంగల్, ములుగు, మహబూబాబాద్, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ జిల్లాల్లో అకాల వర్ష బీభత్సంతో ఊహించని నష్టం వాటిల్లింది. పంట మొత్తం వర్షార్పణమైంది. వరి, మామిడి, మొక్కజొన్న, మిర్చి పంటలు నీటిపాలయ్యాయి. కళ్లెదుటే ధాన్యం నీళ్లలో కొట్టుకుపోవడంతో కర్షకులు కన్నీటిపర్యంతమయ్యారు. సుమారు 21 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాలు చేశారు. ఆరబోసిన ధాన్యం తడవడంతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

వికారాబాద్ జిల్లా పరిగిలో ఈదురు గాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. పలు చోట్ల భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో జనాలు భయాందోళనకు గురయ్యారు. ఈదురు గాలుల ధాటికి పలు చోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి.

కర్నూలు జిల్లాలో పిడుగుపాట్లూ కలకలం రేపాయి. ముగ్గురు మృతి చెందారు. వేరువేరు చోట్ల జరిగిన ఈ ప్రమాదాల్లో స్థానికంగా విషాదం నెలకొంది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఇద్దరు.., ఆలూరు నియోజకవర్గంలో మరొకరు మృతి చెందారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights