- ప్రజ్వల్ రేవణ్ణ కేసు చార్జిషీటులో కీలక విషయాలు..
- మహిళను నిర్బంధించి, అత్యాచారం, ఆపై వీడియోతో బెదిరింపు..
- గతేడాది సంచలనంగా మారిన ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ వ్యవహారం..

Prajwal Revanna: గతేడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో జేడీయూ మాజీ ఎంపీ, మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ కేసులు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మహిళలపై అత్యాచారం చేసి, వీడియోలు తీసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రేవణ్ణ ఇంట్లో పని చేసే 42 ఏళ్ల మహిళ తనపై ప్రజ్వల్ రేవణ్ణ, అతడి తండ్రి హెచ్‌డీ రేవణ్ణ లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. దీంతో ఈ కేసును విచారించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేసింది. ఈ పరిణామాల తర్వాత ప్రజ్వల్ జర్మనీ పారిపోవడం, ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. రేవణ్ణ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హసన్ ప్రాంతంలో ఈ వీడియోలు విస్తృతంగా షేర్ చేయబడ్డాయి.
అయితే, ప్రజ్వల్ రేవణ్ణ కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఇంట్లో పనిమనిషిపై పదే పదే అత్యాచారం చేసి, బలవంతంగా నిర్బంధించడం వంటి అనేక అభియోగాలు ఇందులో ఉన్నాయి. హోళేనరసిపురలోని రేవణ్ణ కుటుంబానికి చెందిన ఫామ్‌హౌజ్‌లో పనిచేస్తు్న్న బాధితురాలు, ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం ఆరోపణలు చేసింది. మొదటి ఘటన 2021లో జరిగినట్లు ఆమె చెప్పింది. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో తనపై లైంగిక దాడులు జరిగిట్లు చెప్పింది. హోళేనరసిపురతో పాటు బెంగళూర్‌లోని నివాసాల్లో ఈ దాడులు కొనసాగినట్లు ఆమె వాంగ్మూలం ఇచ్చింది.
Read Also: Empuran controversy: పృథ్విరాజ్ సుకుమారన్‌కు ఆదాయపు పన్ను శాఖ నోటీసు
మాజీ ఎంపీ ప్రజ్వల్ తనను నిర్భందించి బలవంతంగా అత్యాచారం చేసి, వాటిని వీడియో తీసి, ఎప్పుడైనా వీటి గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు చార్జిషీట్ పేర్కొంది. ఈ వీడియో రికార్డింగులను అడ్డం పెట్టుకుని మహిళను బెదిరించినట్లు, మహిళ మొదట భయంతో ఈ విషయాలను వెల్లడించలేదని ఛార్జిషీట్లో ఉంది. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు ఆన్‌లైన్‌లో కనిపించిన తర్వాత ఆమె చివరకు ఫిర్యాదు చేసింది.
రేవణ్ణ 10 నెలలుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. అతడికి కోర్టు బెయిల్ నిరాకరించింది. అత్యాచార చట్టాలు, లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపులు, సాక్ష్యాలు నాశనం చేయడం వంటి అనేక సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా వీడియోలు రికార్డ్ చేయడం, గోప్యతను ఉల్లంఘించడం వంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2008 సెక్షన్ 66ఈ కింద అభియోగాలు నమోదయ్యాయి. ఏప్రిల్ 09న ట్రయల్ కోర్టు ఈ విషయాన్ని మళ్లీ విచారించనుంది.
ప్రస్తుతం ఈ చార్జిషీట్ ఇంట్లో పనిమనిషి ఆరోపణల ఆధారంగా నమోదైంది. అయితే, ప్రజ్వల్ రేవణ్ణ చాలా మంది మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. ఏప్రిల్ 28, జూన్ 10 2024 మధ్య ఇతడిపై బెంగళూర్ సైబర్ క్రైమ్ సేషన్లలో రెండు కేసులతో పాటు హోళేనరసిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఇతడి తండ్రి హోళేనరసిపుర ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై కేఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది.