PM Modi: ప్రధాని మోదీ మెచ్చిన ఇప్పపువ్వు లడ్డూ..మన్‎కీ‎బాత్‎లో ప్రశంస

Written by RAJU

Published on:

PM Modi: ప్రధాని మోదీ మెచ్చిన ఇప్పపువ్వు లడ్డూ..మన్‎కీ‎బాత్‎లో ప్రశంస

Ippapuvu Laddu: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెచ్చిన ఇప్పపువ్వు లడ్డూ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళలు భీంబాయి ఆదివాసీ సహకార సంఘం ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. వీటిని గిరిజన గర్భిణీలు, బాలింతలు, రక్తహీనతతో బాధపడుతున్నవారికి అధికారులు అందిస్తున్నారు. ఒక్క లడ్డూ 20 గ్రాముల వరకు బరువు ఉంటుంది. కిలో లడ్డూల ధర రూ. 300గా నిర్ణయించారు. 400గ్రాముల ఇప్పపువ్వుల, 190గ్రాముల నువ్వులు, 190 గ్రాముల బెల్లం, 190 గ్రాముల పల్లీలు, 30 గ్రాముల కిస్‌మిస్, మంచి నూనెను కలిపి కిలో లడ్డూలను తయారు చేస్తారు.

దేశంలో తొలిసారిగా 2020లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఆదిలాబాద్ జిల్లాలో 1845 కుమురంభీం జిల్లాలో 817 మంది గిరిజన గర్భిణీలకు ఇప్పపువ్వు లడ్డూలను అందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థినులకు నెలకు దాదాపు 20 క్వింటాళ్ల ఇప్పపువ్వు లడ్డూలను భీంబాయి సంఘం నుంచి కొనుగోలు చేస్తారు. గిరిజన విద్యార్థినులకు ఐటీడీఏ పీవో ఖుష్భుగుప్తా పంపిణీ చేస్తున్నారు. ప్రధాని ప్రశంసించడంపై భీంబాయి ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు కురం భాగుబాయి హర్షం వ్యక్తం చేస్తున్నారు.

భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో పరిశ్రమను విస్తరించేందుకు కష్టపడతామన్నారు. తెలంగాణకు చెందిన ఆదిలాబాద్ జిల్లా సోదరీమణులు ఇప్పపువ్వుతో కొత్త ప్రయోగం చేశారు. వారు రకరకాల వంటకాలు చేస్తున్నారు. వీటిని ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. వారి వంటల్లో ఆదివాసీల సంస్క్రతి తీయదనం కూడా దాగుంది..అని ప్రధాని మోదీ అన్నారు.

Subscribe for notification
Verified by MonsterInsights