ABN
, Publish Date – Apr 02 , 2025 | 06:16 AM
పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో యువకుడిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కారణంతో మహిళ పెట్రోల్ పోసి నిప్పంటించింది. తీవ్రంగా గాయపడిన యువకుడు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

-
తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపణ
-
బాధితుడికి తీవ్ర గాయాలు.. జీజీహెచ్‌కు తరలింపు
క్రోసూరు, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆగ్రహంతో యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిందో మహిళ. తీవ్రంగా గాయ పడిన యువకుడు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఉయ్యందన గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తమ్మిశెట్టి చిరంజీవి అనే యువకుడు కొంత కాలంగా తనపై తప్పుడు ప్రచారం, అసభ్యకరంగా ప్రవర్తించటం వంటివి చేస్తున్నాడని గ్రామానికి చెందిన దేవళ్ళ లక్ష్మి అనే మహిళ ఆరోపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో పలుమార్లు గ్రామస్థుల సమక్షంలో పంచాయితీ కూడా నడిచింది. గ్రామ పెద్దలు యువకుడిని మందలించారు కూడా. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం కూలీలను తీసుకు వెళ్లే ట్రాక్టర్‌పై కూర్చొని ఉన్న చిరంజీవిపై లక్ష్మి వెనుక నుంచి దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించింది. వెంటనే గమనించిన స్థానికులు మంటలను ఆర్పేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. కొంత కాలంగా తన పైనా, తన సోదరి పైనా చిరంజీవి తప్పుడు ప్రచారం చేస్తున్నాడని లక్ష్మి క్రోసూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన పై లక్ష్మి పెట్రోల్ పోసి నిప్పంటించిందని, తనను చంపటానికి ప్రయత్నించిందని చిరంజీవి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date – Apr 02 , 2025 | 06:16 AM