పిఠాపురం అభివృద్ధికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం డెవలెప్‌మెంట్‌పై అమరావతిలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. శాంతిభద్రతలు, వేసవిలో నీటి ఎద్దడి నివారణకు తీసుకుంటున్న చర్యలతోపాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా.. ఇకపై ప్రతివారం నియోజకవర్గ అభివృద్ధిపై రివ్యూ చేయాలని పవన్‌కళ్యాణ్ డిసైడ్ అయ్యారు. అదేసమయంలో.. సొంత ఇలాకాలోని శాంతిభద్రతల అంశంపైనా ప్రత్యేకంగా ఆరా తీసిన పవన్.. పిఠాపురం పోలీసుల వ్యవహారాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రస్తావించారు. పిఠాపురానికి సంబంధించి తన దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను ఆయన పేషీ అధికారులకు వివరించి.. వాటిని వెంటనే జిల్లా పోలీసు యంత్రాంగానికి తెలియచేయాలని సూచించారు. దాంతోపాటు.. పిఠాపురం సెగ్మెంట్‌లోని నాలుగు పోలీస్ స్టేషన్లలోని పరిస్థితులపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని అధికారులను పవన్‌కళ్యాణ్ ఆదేశించడం ఆసక్తి రేపుతోంది.
ఈ క్రమంలోనే.. పిఠాపురం నియోజకవర్గ పోలీసుల తీరుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడుతున్న పోలీసు అధికారుల కారణంగా హోంశాఖ చులకన అవుతోందన్నారు. అందుకే.. ప్రజలను ఇబ్బందిపెట్టే నేరస్తులనే కాదు.. ఆ నేరస్తులకు అండగా నిలుస్తున్న నాయకులు, పోలీసులను కూడా ఉపేక్షించేదిలేదని పవన్‌కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఇక.. పవన్ ఆదేశాలతో పిఠాపురం పరిధిలోని శాంతిభద్రతల అంశాన్ని ఏపీ డీజీపీ దృష్టికి తీసుకువెళ్తామని పిఠాపురం అర్బన్ డెవలెప్‌మెంట్ అధికారులు ప్రకటించారు. మరోవైపు.. పిఠాపురం అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకోవాలని పవన్‌కళ్యాణ్ సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..