Paper Leak: పరీక్ష రాయనివ్వకపోతే చావే శరణ్యం

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 25 , 2025 | 04:59 AM

వాట్సాప్‌లో పదో తరగతి ప్రశ్నపత్రం ప్రత్యక్షమైన ఘటనలో విద్యార్థిని డీబార్‌ చేయగా, ఆమె చేసిన వ్యాఖ్యలు పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపాయి.

Paper Leak: పరీక్ష రాయనివ్వకపోతే చావే శరణ్యం

  • నా తప్పేమీ లేదు.. అన్యాయంగా డీబార్‌ చేశారు: విద్యార్థిని ఝాన్సీరాణి

  • కేసు దర్యాప్తు ముమ్మరం.. 14 మంది బాధ్యులుగా గుర్తింపు

  • ఇప్పటికే మైనర్‌ సహా ఆరుగురి రిమాండ్‌

  • ఎవరి కోసం ఫొటో తీశారనే అంశం తేలనివ్వకుండా ఒత్తిళ్లు?

నల్లగొండ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వాట్సాప్‌లో పదో తరగతి ప్రశ్నపత్రం ప్రత్యక్షమైన ఘటనలో విద్యార్థిని డీబార్‌ చేయగా, ఆమె చేసిన వ్యాఖ్యలు పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపాయి. ఈ ఘటనలో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. మొత్తం 14 మందిని దీనికి బాధ్యులుగా గుర్తించిన పోలీసులు ఇప్పటికే మైనర్‌ సహా మరో ఆరుగురిని రిమాండ్‌కు పంపారు. ఈ వ్యవహారంలో ఫొటో తీసేందుకు ప్రశ్నపత్రం చూపించిన విద్యార్థిని ఝాన్సీరాణిని ఘటన జరిగిన 21వ తేదీనే డీబార్‌ చేశారు. ఇందులో తన ప్రమేయమేమీ లేదని, తనను అన్యాయంగా డీబార్‌ చేశారని సదరు విద్యార్థిని ఝాన్సీరాణి కన్నీటిపర్యంతమయ్యింది. తనపై డీబార్‌ ఎత్తివేసి తనకు మళ్లీ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని అధికారులను వేడుకున్న వీడియో సోమవారం సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది.

తాను పరీక్ష రాస్తున్న హాల్‌ కిటికి వద్దకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి, తమకు ప్రశ్నపత్రం చూపించాలని బెదిరించారని ఆమె వాపోయింది. పేపర్‌ చూపకపోతే రాయితో కొడతామని బెదిరించడం వల్లే తాను ప్రశ్నపత్రం చూపించాల్సి వచ్చిందని తెలిపింది. తాను తెలివైన విద్యార్థినినని, రాష్ట్రంలో ఎక్కడ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసే అవకాశమిచ్చినా రాస్తానని అధికారులను వేడుకుంది. పరీక్షలు రాయనివ్వకపోతే తనకు చావే శరణ్యమంటూ ఝాన్సీ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియా అంతటా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై విచారణ నిర్వహిస్తున్న నకిరేకల్‌ పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలనే డిమాండ్లు వెలువడుతున్నాయి. ప్రశ్నాపత్రం ఎవరి కోసం ఫొటో తీశారనే అంశాన్ని ఇప్పటివరకు తేల్చలేకపోవడం వెనక రాజకీయ, అఽధికార ఒత్తిళ్లు పనిచేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. నకిరేకల్‌ సమీపంలోని మరో నియోజకవర్గానికి చెందిన ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలే ఇందులో కీలకమైన సూత్రధారులని, ఆ విషయం బయటకు రాకుండా ఆకతాయిల చేష్ఠగా చిత్రీకరించి, కేసుని పక్కదారి పట్టిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఈ కేసును పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date – Mar 25 , 2025 | 04:59 AM

Google News

Subscribe for notification