Pamban Bridge Defined Detailed in Telugu

Written by RAJU

Published on:

Pamban Bridge Defined Detailed in Telugu

ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామ నవమి సందర్భంగా తమిళనాడులోని రామేశ్వరంలో కొత్త పంబన్ వంతెనను ప్రారంభించారు. దేశంలోనే ఇది మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్. ఇది రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో అనుసంధానిస్తుంది. అంతేకాక.. భారత రైల్వే శాఖ ఇంజినీరింగ్ నైపుణ్యతకు ఇది నిదర్శనం. 2కిలో మీటర్లకు పైగా పొడవున్న ఈ వంతెన, రామాయణంలో పేర్కొన్న రామసేతుతో చారిత్రక, సాంస్కృతిక సంబంధం కలిగి ఉందని భావిస్తారు.

ఆధునిక పంబన్ వంతెన కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు.. రామాయణ కాలంలో శ్రీరాముడు వానర సైన్యంతో నిర్మించిన రామసేతు నుంచి ఆధునిక భారతదేశం వరకూ సాగిన చారిత్రక పరిణామాలకు సంకేతం. శ్రీరామ నవమి సందర్భంగా హనుమాన్ చాలీసా, వేదమంత్రోచ్ఛారణల మధ్య కొత్త పంబన్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీనిపై మొదటి రామేశ్వరం- తాంబరం ఎక్స్ ప్రెస్ కు మోదీ పచ్చజెండా ఊపారు. పాత పంబన్ వంతెన శిథిలమవడంతో, భారత రైల్వే శాఖ.. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) ఆధ్వర్యంలో కొత్త పంబన్ వంతెన నిర్మాణాన్ని చేపట్టింది. 2019లో 535 కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ 2025లో పూర్తయింది.

ఈ వంతెన దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ సముద్ర వంతెనగా గుర్తింపు పొందింది. 72.5 మీటర్ల పొడవైన దాని మధ్య భాగం 17 మీటర్ల ఎత్తుకు ఎత్తబడుతుంది. దీనివల్ల ఎలాంటి నౌకలైనా సులభంగా దాటవచ్చు. స్టెయిన్‌లెస్ స్టీల్, హై-గ్రేడ్ ప్రొటెక్టివ్ పెయింట్‌లతో నిర్మితమైన ఈ వంతెన, తుప్పు నుంచి రక్షణ కల్పించే ప్రత్యేక పూతతో రూపొందించబడింది. దీని జీవితకాలం సుమారు 58 సంవత్సరాల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే వందేళ్ల వరకూ సేవలందించగలదనే నమ్మకం ఉంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, డబుల్ రైలు ట్రాక్‌లను ఏర్పాటు చేసే సామర్థ్యంతో దీనిని రూపొందించారు. ఈ వంతెన వల్ల రామేశ్వరం నుంచి చెన్నైకి ప్రయాణ సమయం 30 నిమిషాలు తగ్గింది. కొత్త వంతెన వల్ల 2026 నాటికి 15శాతం పర్యాటకం అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు.

Trivikram: బన్నీ కాదు.. ఆ స్టార్ హీరోతో సినిమా సెట్ చేసే పనిలో త్రివిక్రమ్

కొత్త వంతెన సంగతి పక్కన పెడితే పాత పంబన్ వంతెన అనేక రికార్డులు సృష్టించింది. 19వ శతాబ్దంలో భారతదేశం, శ్రీలంక మధ్య రవాణా సౌలభ్యం కోసం రామసేతు సమీపంలో ఒక వంతెన నిర్మించాలని బ్రిటీషోళ్లకు ఆలోచన వచ్చింది. అయితే, రామసేతు భౌగోళిక స్వభావం కారణంగా దానిపై నేరుగా వంతెన నిర్మించడం సాధ్యం కాలేదు. రామేశ్వరం ద్వీపాన్ని ప్రధాన భూభాగంతో కలిపేందుకు 1914లో మొట్టమొదటి పంబన్ వంతెన నిర్మించారు. ఈ వంతెనను బ్రిటిష్ ఇంజనీర్‌లు రూపొందించారు. రైలు రవాణాకు ఇది కీలక మార్గంగా మారింది. పాత పంబన్ వంతెన 2.3 కిలోమీటర్ల పొడవుతో, సముద్రంపై నిర్మితమైన భారతదేశంలోని మొట్టమొదటి రైలు వంతెనగా చరిత్రలో నిలిచింది. దీన్ని ఒక ఇంజినీరింగ్ అద్భుతంగా భావించేవారు. దీని మధ్య భాగంలో ఒక డబుల్-లీఫ్ బాస్క్యూల్ విభాగం ఉండేది. ఇది నౌకలు దాటడానికి వీలుగా పైకి ఎత్తబడేది. ఈ వంతెన రామేశ్వరం యాత్రికులకు, వాణిజ్య రవాణాకు ఒక వరంగా మారింది. 1964 డిసెంబర్ 22న వచ్చిన సునామీ ధాటికి ధనుష్కోడి పట్టణం పూర్తిగా నాశనమైంది. పంబన్ వంతెనపై ప్రయాణిస్తున్న ప్యాసింజర్ రైలు సముద్రంలో కొట్టుకుపోవడంతో 115 మంది మరణించారు. 6 నెలల్లో వంతెనను పునర్నిర్మించి 1965లో తిరిగి ప్రారంభించారు. 104 సంవత్సరాల పాటు సేవలందించిన ఈ వంతెన, సముద్ర వాతావరణం కారణంగా తుప్పు పట్టడం, శిథిలావస్థకు చేరడంతో 2022లో మూసివేశారు.

రామాయణ కాలంలో రామసేతుకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలుసు. ఇప్పుడు పంబన్ వంతెన కూడా అంతే ప్రాముఖ్యత కలిగి ఉంది. దీనికి ఎంతో చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉంది. భారతదేశంలోని రామేశ్వరం ద్వీపాన్ని శ్రీలంకలోని మన్నార్ ద్వీపంతో కలిపే సున్నపురాయి ఇసుక దిబ్బల శ్రేణే రామసేతు. రామాయణం ప్రకారం, ఈ వంతెనను శ్రీరాముడు తన భార్య సీతను రావణుడి నుంచి విడిపించేందుకు వానర సైన్యంతో నిర్మించాడు. వాల్మీకి రామాయణంలో వర్ణించిన ప్రకారం, ఈ వంతెన చెట్ల కాండాలు, రాళ్లతో నిర్మితమై, సముద్రంపై ఒక అద్భుతమైన మార్గాన్ని సృష్టించింది. ఈ కథనం హిందూ సంస్కృతిలో లోతైన నమ్మకంగా రూపొంది, రామసేతును ఒక పవిత్ర స్థలంగా మార్చింది. భౌగోళికంగా రామసేతు సుమారు 30 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. సముద్రంలో కొన్ని చోట్ల కేవలం 1-2 మీటర్ల లోతు మాత్రమే ఉంటుంది. దీంతో ఇది నౌకాయానానికి అనువుకాదని భావించారు. శాస్త్రవేత్తలు ఈ ఇసుక దిబ్బలు సహజంగా ఏర్పడినవని, సుమారు లక్ష 25వేల సంవత్సరాల క్రితం సముద్ర మట్టాలు తగ్గినప్పుడు ఆవిర్భవించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, హిందూ భక్తులు దీనిని శ్రీరాముడి దైవిక శక్తికి చిహ్నంగా భావిస్తారు.

రామసేతు చారిత్రక ప్రస్తావనలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. గతంలో ఎంతో మంది రచయితలు ఈ వంతెన గురించి తమ రచనల్లో పేర్కొన్నారు. 9వ శతాబ్దంలో ఓ అరబ్ రచయిత దీన్ని “సెట్ బంధాయ్” అంటే సముద్ర వంతెన అని పేర్కొన్నాడు. 11వ శతాబ్దంలో పర్షియన్ చరిత్రకారుడు అల్-బిరూనీ దీనిని “ఆడమ్స్ బ్రిడ్జ్”గా సూచించాడు. ఇస్లామిక్ సంప్రదాయంలో ఆడమ్ అంటే ఆదాము ఈ ప్రాంతం గుండా శ్రీలంకకు వెళ్లాడని నమ్ముతారు. ఇలా రామసేతు వివిధ సంస్కృతులలో విభిన్న పేర్లతో విభిన్న కథనాలతో ప్రసిద్ధి చెందింది. మధ్యయుగంలో, రామసేతు సమీపంలోని రామేశ్వరం ఒక పవిత్ర తీర్థస్థలంగా అభివృద్ధి చెందింది. రామనాథస్వామి ఆలయం ఇక్కడ స్థాపించబడి, భక్తులను ఆకర్షించడం ప్రారంభించింది. అయితే, రామసేతు సముద్రంలో ఎక్కువగా మునిగిపోవడం, దాని పైన నడవడం లేదా ప్రయాణించడం అసాధ్యం కావడంతో, ఇది కేవలం పౌరాణిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మాత్రమే కలిగి ఉండేది.

కొత్త పంబన్ వంతెన నిర్మాణం కేవలం ఒక రవాణా మార్గం మాత్రమే కాదు. రామసేతుతో జనం గుండెల్లో చెరిగిపోయిన సాంస్కృతిక భావనకు ఆధునిక రూపం. రామాయణంలో వర్ణించిన రామసేతు ఒక దైవిక నిర్మాణంగా భావించబడితే, నేటి పంబన్ వంతెన భారతీయ ఇంజనీరింగ్ శక్తికి చిహ్నంగా నిలుస్తోంది. ఈ రెండింటి మధ్య ఒక అద్భుతమైన సంబంధం ఉందని చాలా మంది భక్తులు నమ్ముతారు. రామేశ్వరం సమీపంలోని ధనుష్కోడి నుంచి రామసేతు ప్రారంభమైనట్లు రామాయణం చెబుతుంది. ఈ ప్రాంతం ఇప్పటికీ యాత్రికులకు ఒక పవిత్ర స్థలంగా ఉంది. పంబన్ వంతెన రామసేతుకు సమాంతరంగా నిర్మితమైనప్పటికీ, దీని ఉనికి ఆ పౌరాణిక కథనానికి ఒక ఆధునిక సాక్ష్యంగా కనిపిస్తుంది. ప్రధాని మోదీ ఈ వంతెనను శ్రీరామ నవమి రోజున ప్రారంభించడం, రామనాథస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం దీని సాంస్కృతిక ప్రాముఖ్యతను మరింత హైలైట్ చేసింది.

రామసేతు నుంచి పంబన్ వంతెన వరకూ పరిణామం అనేక దశలను దాటింది. పౌరాణిక కాలంలో దైవిక నిర్మాణంగా, మధ్యయుగంలో ఆధ్యాత్మిక కేంద్రంగా, ప్రస్తుతం రవాణా మార్గంగా రూపాంతరం చెందింది.
21వ శతాబ్దంలో పంబన్ వంతెన భారతదేశ సాంకేతిక పురోగతికి ప్రతీకగా నిలుస్తోంది. రామేశ్వరం ప్రాంతంలో ఈ వంతెన పర్యాటకం, ఆర్థికాభివృద్ధికి కొత్త అవకాశాలను తెరుస్తుందని భావిస్తున్నారు. అదే సమయంలో, రామసేతు చారిత్రక, సాంస్కృతిక విలువలను కాపాడుతూ, ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయడం ఒక సవాలుగా ఉంది. 2000లలో సేతు సముద్రం షిప్పింగ్ కాలువ ప్రాజెక్ట్ ప్రతిపాదన సందర్భంగా రామసేతును తవ్వడంపై వివాదం చెలరేగింది. అప్పుడు, భక్తులు, పర్యావరణవేత్తలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో, పంబన్ వంతెన నిర్మాణం ఒక మధ్యేమార్గ పరిష్కారంగా కనిపించింది.

కొత్త పంబన్ వంతెన రామసేతు పౌరాణిక గాథ నుంచి ఆధునిక భారతదేశ సాంకేతిక శక్తి వరకూ సాగిన ప్రయాణానికి ఒక అద్దం పడుతుంది. ఇది కేవలం రైలు రవాణా సౌలభ్యం మాత్రమే కాదు. భారత సంస్కృతి, చరిత్ర, ఆధునికతల సమ్మేళనం. ఈ వంతెన రామేశ్వరం యాత్రికులకు, స్థానికులకు కొత్త ఆశలను తీసుకొచ్చింది. రామసేతు పవిత్రతను కాపాడుతూ భవిష్యత్తు వైపు ఒక అడుగు వేసింది.
Explainer : రామసేతు నుంచి పంబన్ వంతెన దాకా ఏం జరిగింది..? | All about Pamban Bridge | NTV Digital

Subscribe for notification
Verified by MonsterInsights