- భారత్‌పై పాకిస్తాన ప్రతీకార చర్యలు..
- వాణిజ్యం రద్దు, ఎయిర్ స్పేస్ మూసివేత..
- సింధు ఒప్పందం రద్దు ‘‘యుద్ధ చర్య’’గా అభివర్ణన..
- సైన్యానికి సెలువులు రద్దు, సరిహద్దుల వద్ద క్షిపణి పరీక్షలు..

Pakistan: పాకిస్తాన్, భారత్ చర్యలపై ప్రతీకార చర్యలకు దిగింది. గురువారం పాకిస్తాన్ ‘‘సిమ్లా ఒప్పందం’’ సహా భారత్‌తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలుపుదల చేసుకునే హక్కును వినియోగించుకుంటామని తెలిపింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన ఈ రోజు జాతీయ భద్రత కమిటీ(ఎన్ఎస్‌సీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్మీ అధికారులతో పాటు ఆ దేశంలోని కీలక అధికారులు హాజరయ్యారు.
పాకిస్తాన్ ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ భారత్ రద్దు చేయడాన్ని తీవ్రంగా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించింది. సింధు జలాల ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్‌కి చెందిన నీటి ప్రవాహాన్ని ఆపడానికి లేదా మళ్లించడానికి చేసే ఏ ప్రయత్నాన్నైనా పాకిస్తాన్ తీవ్రంగా తిరస్కరిస్తున్నట్లు చెప్పింది. దిగువ నదీ తీరహక్కులను ఆక్రమించడాన్ని ‘‘యుద్ధ చర్య’’గా భావిస్తున్నట్లు పేర్కొంది.
Read Also: Danam Nagendar: సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ ఇప్పటికే పాకిస్తాన్‌తో దౌత్య సంబంధాలు పూర్తిగా తగ్గించుకుంది. పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేసింది. ఇండస్ వాటర్ ట్రిటీని రద్దు చేసింది. పాకిస్తాన్-భారత్ సరిహద్దును మూసేసింది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగుతోంది. ‘‘భారతదేశ యాజమాన్యంలోని లేదా భారత్ దేశం నిర్వహించే అన్ని విమానయాన సంస్థలకు పాకిస్తాన్ గగనతలాన్ని తక్షణమే మూసేస్తున్నాం’’ అని పాకిస్తాన్ ప్రకటించింది. భారతతో వాణిజ్యాన్ని నిలిపేస్తున్నట్లు చెప్పింది. వాఘా సరిహద్దు పోస్టును మూసేస్తున్నామని, హైకమిషన్ సంఖ్యను 30కి తగ్గిస్తామని మరియు భారత హైకమిషన్ నుండి రక్షణ సేవల అధికారులను బహిష్కరిస్తామని కూడా ఇది పేర్కొంది.
మరోవైపు, పాకిస్తాన్ తన యుద్ధ విన్యాసాలను ఎక్కువ చేసింది. క్షిపణి పరీక్షల్ని నిర్వహిస్తోంది. సరిహద్దుల్ని అలర్ట్ చేసింది. సైన్యంలో సెలవుల్ని రద్దు చేసింది. భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని పాక్ ఆర్మీకి ఆదేశాలు అందాయి. ఇప్పటికే భారత సరిహద్దుల్లో ఉన్న పాక్ గ్రామాల్లోని ప్రజల్ని అక్కడి ఆర్మీ ఖాళీ చేయించింది.