- భారత్ మోస్ట్ వాంటెడ్ జకీర్ నాయక్‌కి పాక్ ఆతిథ్యం..
- పాక్ వైఖరి ఏమిటో దీని ద్వారా తెలిసిందన్న భారత్..
- జకీర్ నాయక్‌పై మనీలాండరింగ్, ఉగ్రవాదాన్ని ఆరోపణలు..

Zakir Naik: భారత్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తి, వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడు జాకీర్ నాయక్‌కి దాయాది దేశం పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌లో జకీర్ నాయక్, మాజీ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్‌లను కలిసిన తర్వాత భారత్, పాకిస్తాన్ వైఖరి ఏమిటో తెలిసిందని వ్యాఖ్యానించింది.
శుక్రవారం, విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ..భారత్ న్యాయం కోసం జకీర్ నాయక్‌ని అప్పగించాలని కోరుతుంటే, ఆయనకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వడంపై వైఖరి ఏమిటని ప్రశ్నించారు. పాకిస్తాన్ అతడిని ఆహ్వానించడం ఇదే తొలిసారి కాదని జైశ్వాల్ అన్నారు. ‘‘భారత్ మోస్ట్ వాంటెండ్ వ్యక్తికి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వడం చూస్తే, దీని అర్థం ఏంటో తెలుస్తోంది’’ అని ఆయన అన్నారు.
Read Also: Delimitation Row: వైఫల్యాలను కప్పిపుచ్చడానికే స్టాలిన్ వ్యూహం.. బీజేపీ విమర్శలు..
ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం, మార్చి 18న నాయక్ పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్, పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్‌లను రైవిండ్‌లోని వారి నివాసంలో కలిశారు. షరీఫ్ ఫ్యామిలీ ఎస్టేట్‌లో జరిగిన ఈ సమావేశంలో జకీర్ నాయక్, పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (PML-N) నాయకులు వివిధ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. అయితే, వీరు ఏ అంశాలపై మాట్లాడారనే వివరాలను వెల్లడించలేదు. గత వారం పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్, జకీర్ నాయక్‌ని కలిసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన తర్వాత, విమర్శలు ఎదుర్కొన్నాడు. జకీర్ నాయక్ మనీలాండరింగ్, ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఇతడికి మలేషియా ఆశ్రయం ఇస్తోంది. గతంలో ఒకసారి పాకిస్తాన్ వెళ్లిన జకీర్ నాయక్ క్రైస్తవ సమాజం, వారి నమ్మకాల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.