- జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడి
- ఘాటు వ్యాఖ్యలు చేసిన సునీల్ గవాస్కర్
- మిల్లీమీటర్ భూమిని లాక్కోలేరు

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఘటనపై ప్రపంచం మొత్తం స్పందిస్తోంది. ఉగ్రదాడిపై పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. తాజాగా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు గత 78 ఏళ్లలో సాధించింది ఏమీ లేదని, 78 వేల సంవత్సరాలైనా మిల్లీమీటర్ భూమిని లాక్కోలేరన్నారు.
Also Read: Virat Kohli: బాబర్, గేల్‌ల రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ!
ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అనంతరం సునీల్ గవాస్కర్ ఉగ్రదాడిపై మాట్లాడారు. ‘ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. ఈ ఘటన భారతీయులందరి పైనా ప్రభావం చూపిస్తుంది. ఉగ్రవాదులను, వారికి మద్దతుగా నిలిచే వారిని ఓ ప్రశ్న అడుగుదామనుకుంటున్నా.. ఇదంతా ఏం సాధించడానికి చేస్తున్నారు?. ఈ పోరాటం ద్వారా ఏం సాధించారు?. గత 78 ఏళ్లలో ఒక్క మిల్లీమీటర్ భూమినైనా కదల్చగలిగిరా?. వచ్చే 78 వేల సంవత్సరాలైనా ఏమీ మారదు. ప్రశాంతంగా జీవించకుండా ఇలాంటి దారుణ ఘటనలకు ఎందుకు పాల్పడుతున్నారు. మనం మరింత దృఢంగా ముందుకు సాగాలనేదే నా విజ్ఞప్తి’ అని సన్నీ అన్నారు.