- బీసీసీఐ కీలక నిర్ణయం
- పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడే ప్రసక్తే లేదు
- కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే బీసీసీఐ అదే

పహల్గాంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. మంగళవారం సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రదాడి నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో కూడా పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడే ప్రసక్తే లేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.
‘పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం. కేంద్ర ప్రభుత్వం ఏం చెబితే బీసీసీఐ అదే చేస్తుంది. ఇప్పటికే పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను భారత్ ఆడటం లేదు. భవిష్యత్తులో కూడా ఆడే ప్రసక్తే లేదని బలంగా చెబుతున్నాం. ఇన్నాళ్లు అంతర్జాతీయ క్రికెట్ మండలిని గౌరవిస్తూ ఐసీసీ ఈవెంట్లలో తటస్థ వేదికలపై తలపడుతున్నాం. ఇప్పుడు భారతదేశంలో జరిగిన దానిపై ఐసీసీకి ఓ అవగాహన ఉందనుకుంటున్నా. కేంద్రం సూచనల మేరకు మేము పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడము’ అని రాజీవ్ శుక్లా చెప్పారు.
Also Read: Rajat Patidar: హోంగ్రౌండ్ ఓటములకు సాకులు చెప్పడం సరైంది కాదు!
కొన్నేళ్లుగా భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీలలో మాత్రమే ఇండో-పాక్ జట్లు తటస్థ వేదికలపై తలపడుతున్నాయి. భారత్ చివరిసారిగా 2008లో ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌కు వెళ్లింది. 2023లో ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం పాక్ చివరిసారిగా భారత్‌కు వచ్చింది. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో దుబాయ్ వేదికగా ఇరు దేశాలు తలపడ్డాయి. ఆ సమయంలో పలువురు పాక్ మాజీ క్రికెటర్లు భారత్-పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఉంటే బాగుంటుందన్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో బీసీసీఐ స్పష్టత ఇవ్వడంతో ఆ ఆలోచనలకు తెరపడినట్లే. ఇప్పట్లో ఇండో-పాక్ ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచ్‌లు అసాధ్యమే.