పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని నిద్రపోనివ్వడంలేదు. ఘోరాన్ని చూసి జనం గుండె చెరువవుతోంది. పహల్గాం ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 28 చేరింది. 20 మందికిపైగా గాయాలయ్యాయి.. అయితే.. ఈ ఘటన సమయంలో పర్యాటకుల భయాందోళన వర్ణనాతీతం.. బుధవారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో బైసరన్ లోయలో సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా కాల్పులు జరిపారు.. ఈ నరమేధం నుంచి బయటపడిన బాధితులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఉగ్రదాడి సమాచారం అందుకున్న సైనికులు ఘటనా స్థలానికి వెళ్లి.. వారిని రక్షించడానికి ప్రయత్నిస్తుండగా.. అక్కడ ఉన్న పర్యటకులు.. వారు కూడా ఉగ్రవాదులే అనుకుని భయంతో వణికి పోయారు.
ఉగ్రవాదులు మళ్లీ ఆర్మీ దుస్తుల్లో తమపై దాడి చేయడానికి వచ్చారేమో అనుకొని సైనికులను చూసిన ఓ మహిళ తన చిన్నారిని ఏమీ చేయొద్దని బోరున విలపిస్తూ చేతులు జోడించి వారిని వేడుకుంది. ఇతర పర్యటకులు కూడా భయంతో తమ పిల్లలను దాచడానికి ప్రయత్నించారు. ఓ సైనికుడు వారికి ధైర్యం చెప్తూ.. తాము భారత ఆర్మీ సిబ్బంది అని.. మిమ్మల్ని రక్షించడానికే ఇక్కడికి వచ్చామని భరోసా ఇస్తూ..పర్యాటకుల వివరాలు తెలుసుకుని సహాయక సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా.. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వీడియో చూడండి..
పహల్గామ్.. ఉగ్రదాడి ముందు.. ఉగ్రదాడి తర్వాత అన్నట్లు మారిపోయింది. ఉగ్రదాడికి ముందు ప్రకృతి అందాలతో చూపు తిప్పుకోనివ్వని పహల్గామ్.. ఉగ్రదాడి తర్వాత భూతల నరకంగా మారింది.
భూతల స్వర్గం.. భీతావహ దృశ్యానికి సాక్ష్యంగా నిలిచింది..
పహల్గామ్, జమ్ముకశ్మీర్‌లోని అద్భుత పర్యాటక ప్రాంతం. నిశ్శబ్ద వాతావరణం, గాలి కాలుష్యం లేకుండా ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. జీవితంలో మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడే ప్రశాంత లోయ, ఒక్కసారిగా భీతావహ దృశ్యానికి సాక్ష్యంగా నిలిచింది. మొన్న ఒక్కసారిగా అలజడి రేగింది. ముష్కరుల నరమేధంతో చల్లని ప్రదేశాన్ని చూద్దామని వచ్చిన వారిని పొట్టనబెట్టుకున్నారు ముష్కరులు. రెండ్రోజుల ముందు వరకు పహల్గామ్ అంత భూతల స్వర్గం లేదు. చుట్టూ పచ్చని పచ్చిక భూములు, స్వచ్ఛమైన గాలి, స్పష్టమైన నీలి ఆకాశం, మండు వేసవిలోనూ పాలనురగల పరవళ్లు. మంచు కొండలే పిలుస్తున్నాయా అనేలా అద్భుత అనూభూతి కలిగించే వాతావరణం. కానీ ఇప్పుడు భూతల స్వర్గం కాస్త నరకంలా కనిపిస్తోంది. పచ్చికబయళ్లలో తిరుగుతూ ప్రకృతి అందాలను చూసి పరవశిస్తున్న పర్యాటకులపై జరిగిన కాల్పులు కళ్ల ముందే తిరుగుతున్నాయి. పర్యాటకులతో కళకళలాడాల్సిన ప్రాంతం ఇప్పుడు ఖాళీగా కనిపిస్తోంది. పచ్చని కొండల్లో నెత్తుటేర్లు పారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..