జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో అనేక మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు వివేశీయులు సహా మొత్తం 28 మంది వరకు మరణించగా.. ఎంతో మంది జీవితాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఉగ్రదాడి ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో భారత్‌లోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల వద్ద భద్రతను పెంచాయి. ఇందులో భాగంగా ఏపీలోని తిరుమల తిరుపతి దేవస్ధానం అలర్ట్ అయ్యింది. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని టీటీడీ యంత్రాంగం భద్రతను పెంచింది. అలిపిరి నుంచి ఆలయం వరకు భద్రతను కట్టుదిట్టం చేసింది. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులోనూ చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. పలుచోట్ల ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర ప్రైవేటు వాహనాలను తనిఖీ చేస్తోంది. ప్రయాణికుల లగేజీతో పాటు ప్రతి బ్యాగ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది. ఈ సందర్భంగా టిటిడి సీవీఎస్ఓ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో అదునాతన టెక్నాలజీతో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టామన్నారు.
వీడియో చూడండి…
మరోవైపు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆక్టోపస్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రవాదులు చొరబడితే వారి నుంచి భక్తులను ఎలా కాపాడాలని మాక్ డ్రిల్ చేశారు. మాక్ డ్రిల్‌లో పోలీసు, విజిలెన్స్, ఆక్టోపస్ బలగాలు పాల్గొన్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.