Pahalgam Terror Assault: వార్‌ టెన్షన్‌.. ఇండియా, పాకిస్థాన్‌ మధ్యలో యూకే!

Written by RAJU

Published on:

Pahalgam Terror Assault: వార్‌ టెన్షన్‌.. ఇండియా, పాకిస్థాన్‌ మధ్యలో యూకే!

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తలు చోటు చేసుకున్నాయి. ఇరు దేశాలు సరిహద్దుల వద్ద సైన్యాన్ని భారీ ఎత్తున్న మోహరిస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ భయం నెలకొంది. ఈ నేపథ్యంలో యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్‌లతో చర్చలు జరిపారు. ఈ చర్చలు ఇండియా, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగాయి. లామీతో ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని భారత విదేశాంత మంత్రి జైశంకర్‌ సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ఈ రోజు యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీతో మాట్లాడాను. పహల్గామ్‌లో జరిగిన సరిహద్దు ఉగ్రవాద దాడి గురించి చర్చించాను. ఉగ్రవాదం పట్ల జీరో టాలరెన్స్ ప్రాముఖ్యతను వివరించాను” అని జైశంకర్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడి పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగింది. ఈ దాడిలో ఒక నేపాల్ జాతీయుడు సహా 26 మంది మరణించారు. 2019 పుల్వామా దాడి తర్వాత ఈ ప్రాంతంలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది. జమ్మూ కశ్మీర్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం బైసారన్ మేడో సమీపంలో బాధితులు మరణించారు. అలాగే పాక్‌ ఉప ప్రధాని ఇషాక్‌ దార్‌తో యూకే విదేశాంగ కార్యదర్శి మాట్లాడుతూ.. ఉద్రిక్తతలను తగ్గించాల్సిన అవసరం, శాంతియుత పరిష్కారం కోసం ప్రయత్నించాలని పిలుపునిచ్చారు. ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాక్‌పై అనేక చర్యలు చేపట్టింది. 1960 సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, దౌత్య సంబంధాలను తగ్గించడం, అట్టారి సరిహద్దు క్రాసింగ్‌ను మూసివేయడం వాటిలో భాగమే. మరోవైపు పాకిస్తాన్ తన గగనతలంలోకి భారత విమానాలు రాకుండా నిషేధం విధించింది.

అలాగే యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్‌ లామీతో జరిపిన చర్చలపై పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం భారత్‌ ఏకపక్ష చర్యలపై పాకిస్తాన్ ఆందోళనలను వ్యక్త పరిచినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఈ ఉగ్రదాడిని న్యూయార్క్‌లోని క్వీన్స్‌లోని దావూదీ బోహ్రా సమాజం, కెనడియన్ పౌరులు, నేపాల్ చట్టసభ సభ్యులు ఖండించారు, బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారతదేశానికి మద్దతు ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights