జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి పై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ భయంకరమైన దాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నామని పాకిస్తాన్ మద్దతుగల ఎల్‌ఇటి-టిఆర్‌ఎఫ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. కాగా ఈ ఉగ్రవాద దాడి వెనుక పాక్ హస్తం ఉందని ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ఆరోపించాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన కనేరియా.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోన్నందుకు పాకిస్తాన్ సిగ్గుపడాలన్నాడు. ఇందులో పాక్ పాత్ర లేకుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నారని డానిష్ ప్రశ్నించాడు. కాగా పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం వైపు నుంచి చర్యలు ప్రారంభమయ్యాయి. దౌత్యపరంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ తో సంబంధాలను తెంచుకుంది. ఇందులో భాగంగానే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇంతలో అమెరికా, రష్యా, చైనా తదితర దేశాలు, అగ్ర నాయకులు పహల్గామ్ దాడిని ఖండించారు. ఉగ్రవాదం నిర్మూలనలో భారతదేశానికి సహకరిస్తామని ప్రకటించారు. అయితే, ఈ దురాగతాన్ని ఖండిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఇప్పుడు దీనినే తప్పుపట్టాడు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా.
పహల్గామ్ దాడిపై సందేహాలు వ్యక్తం చేసిన డానిష్ కనేరియా.. ‘ఈ దాడిలో పాకిస్తాన్ హస్తం నిజంగా లేకుంటే, మన ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ఈ విషయం గురించి ఎందుకు స్పందించడం లేదు? అలాగే భారతదేశంలో దాడి జరిగినప్పుడు పాకిస్తాన్ సైన్యాన్ని అకస్మాత్తుగా హై అలర్ట్‌లో ఉండాలని ఎందుకు చెప్పారు? ఎందుకంటే మీకు నిజం తెలుసు. మీరు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారు. వారిని పెంచి పోషిస్తున్నారు. ఇందుకు మీరు సిగ్గుపడాలి’ అని డానిష్ కనేరియా సోషల్ మీడియా ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు.
డానిష్ కనేరియా ట్వీట్..
If Pakistan truly has no role in the Pahalgam terror attack, why hasn’t Prime Minister @CMShehbaz condemned it yet? Why are your forces suddenly on high alert? Because deep down, you know the truth — you’re sheltering and nurturing terrorists. Shame on you.
— Danish Kaneria (@DanishKaneria61) April 23, 2025
పాకిస్తాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హిందూ క్రికెటర్ డానిష్ కనేరియా. 2000 సంవత్సరంలో పాకిస్తాన్ జట్టులో స్పిన్నర్‌గా ఎంపికైన డానిష్, 61 టెస్ట్ మ్యాచ్‌ల్లో మొత్తం 261 వికెట్లు పడగొట్టాడు. అలాగే 18 వన్డేల్లో 15 వికెట్లు కూడా పడగొట్టాడు
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…