-
నిరసనలు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
-
విద్యార్థి సంఘాల ఆందోళన ఉధృతం
-
లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు ర్యాలీ
-
అడ్డుకున్న పోలీసులు, అరెస్టులు
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 17(ఆంధ్రజ్యోతి): ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. నినాదాలతో దద్దరిల్లింది. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, నినాదాలపై నిషేధం విధిస్తూ విడుదల చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఆందోళన ఉధృతం చేశాయి. ఇందులో భాగంగా ఏబీపీవీ సోమవారం ఓయూ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు ఏబీవీపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం అన్ని విద్యార్థి సంఘాల నాయకులు లైబ్రరీ నుంచి ఓయూ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ర్యాలీని ఇంకా ముందుకు తీసుకెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టులు చేశారు. అరెస్టయిన వారిని అంబర్‌పేట, లాలాగూడ, నల్లకుంట పోలీస్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. అరెస్టులతో ఉద్యమాన్ని, ప్రశ్నించే గొంతులను ఆపలేరన్నారు. ఓయూలో ఎమర్జెన్సీ పాలన సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వీసీ వెంటనే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
నిరసనలపై నిషేధం అప్రజాస్వామికం
ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలపడంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీచేయడం అప్రజాస్వామికమని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో, విద్యార్థుల హక్కులకు సంబంధించిన ఎన్నో పోరాటాల్లో కీలకపాత్ర పోషించింది ఓయూ విద్యార్థులేనని స్పష్టం చేశారు. ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే గద్దె దించడం తెలంగాణ యువతకు పెద్ద విషయం కాదన్నారు. విద్యార్థుల హక్కులను హరించేలా విడుదల చేసిన సర్క్యులర్ వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల అరెస్టులను ఖండిస్తున్నాం
ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని, తెలంగాణ ఉద్యమానికి గుండెకాయలాంటి ఓయూలో ఆంక్షలు విధించడం అప్రజాస్వామికమని ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు. విద్యార్థులను అణచి వేయడం మానేసి, వారి సమస్యలు విని, తక్షణ పరిష్కారం చూపాలని సోమవారం ఎక్స్ వేదికగా ఆయన సూచించారు.
బీఆర్‌ఎస్వీ నాయకులకు ఊరట
కేసీఆర్‌పై సీఎం రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఆందోళన చేపట్టిన బీఆర్‌ఎస్వీ నాయకుడు కందుల మధు, తదితరులకు నాంపల్లి కోర్టు ఊరటనిచ్చింది. సీఎం రేవంత్ రెడ్డిని అసభ్యపదజాలంతో దూషించినందున రిమాండ్‌కు ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరగా, రిమాండ్‌ను నిరాకరించాలని నిందితుల తరఫున న్యాయవాది జి.కిరణ్ కుమార్ వాదించారు. ఇరువురి వాదనల అనంతరం కోర్టు రిమాండ్‌ను నిరాకరించడంతో బీఆర్‌ఎస్వీ నాయకులు విడుదలయ్యారు.