
తెలంగాణ కాంగ్రెస్‌లో నిశ్శబ్దం బద్దలైందా? ఇన్నాళ్ళు నాకెందుకులే…. అది నా పని కాదని అన్నట్టుగా ఉండే వాళ్ళు యాక్టివ్ అయ్యారా? అసెంబ్లీ సాక్షిగా నాయకుల్లో మార్పు కనిపించిందా? అధికార పక్షం ఇక దూకుడు పెంచబోతోందా? పార్టీలో వచ్చిన మార్పు ఏంటి? దానిపై జరుగుతున్న చర్చ ఏంటి? కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఎన్ని కుమ్ములాటలు ఉన్నా…. గ్రూపులు కట్టినా….ఓవరాల్‌గా పార్టీ, ప్రభుత్వం మీదికి ఎవరన్నా దాడికి దిగితే… అంతా ఏకతాటి మీదికి వస్తుంటారు. కానీ… ఈ మధ్య కాలంలో అలాంటి వాతావరణం కనిపించడం లేదని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా ఈసారి అధికారంలోకి వచ్చాక…. గడిచిన ఏడాదిన్నరలో ఈ సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. దీంతో పరిస్థితి చేయిదాటి పోతోందని గమనించిన హైకమాండ్ చేపట్టిన దిద్దుబాటు చర్యలు ఇప్పుడిప్పుడే ఫలితం ఇస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రతిపక్షం నుంచి ఎవరు ఎవర్ని విమర్శించినా….దీటుగా ఎదుర్కోవాల్సిందేనని నిర్దేశం చేసిందట అగ్రనాయకత్వం. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో చాలా అలర్ట్ గా కనిపిస్తోంది అధికారపక్షం. స్పీకర్ పై జగదీశ్ రెడ్డి వ్యాఖ్యల విషయంలో ఎదురుదాడి కనపడింది. సభలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు, ఇతర సభ్యులంతా ఏకతాటి మీదికి వచ్చి నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి కొనసాగింపుగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సమయంలో… బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శలకు అధికార పక్షం నుంచి దీటుగానే సమాధానం వచ్చింది. సహజంగా వాళ్ళు అనేది అనుకోనివ్వండన్న మనస్తత్వంతో ఉంటారు కాంగ్రెస్ నేతలు. కానీ… ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా చర్చను తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేశారు అధికార పక్ష సభ్యులు. అసలు ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలేవీ చేయడం లేదన్న బీఆర్‌ఎస్ విమర్శలకు చాకచక్యంగా స్పందించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ విమర్శకు సమాధానం చెబుతున్నట్టుగానే… అసలు ఈ ఏడాదిన్నరలో తమ ప్రభుత్వం ఏం చేసిందో వివరాలన్నింటిని సభలోనే ప్రకటించేశారు. సభలో వాడి వేడి చర్చ జరుగుతున్న సమయంలోనే మరో విషయమై తన చతురత ప్రదర్శించారు భట్టి. ప్రతిపక్ష సభ్యుల నియోజకవర్గాల్లో 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు లబ్ధిదారుల వివరాలను ప్రకటించేశారు. ఇక పదేపదే ప్రతిపక్షం రైతు రుణమాఫీ అంశాన్ని ప్రస్తావిస్తోంది.
దీంతో ఆ వివరాలను కూడా చెబుతూ….బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన రుణ మాఫీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేసిన రుణ మాఫీని పోల్చి తామెలా బెటర్‌గా చేయగలిగామో చెప్పేశారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన దానికంటే ఎక్కువ మంది రైతులకు తాము రుణ మాఫీ చేశామన్న వివరాలని సభ ముందు ఉంచారాయన. ఈ చర్య ద్వారా వ్యూహాత్మకంగా సభను తన అటెన్షన్ లోకి తీసుకున్నారు డిప్యూటీ సీఎం. ఇక మరో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడా బీఆర్‌ఎస్ విమర్శలకు దీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. బీసీ కులగణనపై ప్రతిపక్షాల ఆరోపణలను దీటుగా తిప్పి కొట్టారాయన. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి కులగణన విషయంలో ఉన్న కమిట్మెంట్ ను సీరియస్ గానే చెప్పేశారు. పదేపదే కృష్ణా జలాల వివాదంపై ప్రతిపక్షం చేస్తున్న రాద్ధాంతంపై కూడా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు ఉత్తమ్. కృష్ణా జలాల్లో తెలంగాణకి అన్యాయం జరిగితే… అది ముమ్మాటికి కేసీఆర్, హరీష్ రావుల వల్లనేనని సభలో స్పష్టం చేశారు. వీటితోపాటు పులిచింతల వల్ల తెలంగాణకు నష్టం లేదంటూ… ప్రతిపక్షానికి దీటుగా సమాధానం ఇచ్చారు ఇరిగేషన్ మినిష్టర్. ఇలా… గడిచిన మూడు రోజులుగా శాసనసభలో అధికార పక్షం పైచేయి సాధించే పనిలో పడింది. ఆ విషయంలో సక్సెస్ అయ్యామన్న అభిప్రాయం కూడా పెరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో. ఇన్ని రోజులు చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో ప్రతిదానికి సీఎం రేవంత్‌రెడ్డే సమాధానం చెప్పుకోవాల్సి వచ్చేది. దీంతో… ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడంలో మిగతా సీనియర్స్ ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నారన్న చర్చ జరిగేది. సాధారణంగా ప్రతి అసెంబ్లీ సెషన్‌లో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క లాంటి వారు ప్రభుత్వం తరపున రియాక్ట్ అయ్యేవారు. తాజాగా ఇప్పుడు వాళ్ళకు భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి కూడా తోడవడంతో… కాంగ్రెస్‌లో నిశ్శబ్దం బద్దలై… టీమ్ వర్క్ మొదలైందన్న మాటలు వినిపిస్తున్నాయి. కొత్త ఇన్ఛార్జ్ వచ్చాక మార్పు మొదలైందా అన్న చర్చ సైతం ఉంది పార్టీ వర్గాల్లో. ఇది ఇలాగే కొనసాగితే… విపక్షాన్ని దీటుగా ఎదుర్కొంటామన్న విశ్వాసం కాంగ్రెస్ వర్గాల్లో పెరుగుతుందని అంటున్నారు పరిశీలకులు.