
ప్లీనరీ సక్సెస్ కోసం గులాబీ అధిష్టానం స్పెషల్ స్కెచ్ వేసిందా? పైకి ఎన్ని గొప్పలు చెబుతున్నా…. జన సమీకరణ విషయంలో డౌట్స్ ఉన్నాయా? అందుకే పార్టీ నాయకులకు బంపరాఫర్ ప్రకటించేసిందా? చెప్పాల్సింది చెప్పేసి… ఇక మీ ఇష్టం…. మీ సత్తా…. నిరూపించుకోండని వదిలేసిందా? వరంగల్ గ్రౌండ్ నింపేందుకు బీఆర్‌ఎస్ పెద్దలు పెట్టిన స్కీమ్ ఏంటి? టార్గెట్ ఎంతవరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది? అధికారంలో లేకున్నా డోంట్ మైండ్… పార్టీ రజతోత్సవ వేడుకల్ని మాత్రం గ్రాండ్‌గా నిర్వహించాలని డిసైడైందట బీఆర్‌ఎస్ అధిష్టానం. వరంగల్‌లో జరిగే భారీ బహిరంగ సభతో కార్యక్రమాలు మొదలై ఏడాది పొడవునా జరుగుతాయని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. అందుకే ఓరుగల్లు సభను గ్రాండ్ సక్సెస్ చేయాలన్న పట్టుదలగా ఉన్నారట గులాబీ పెద్దలు. దాదాపు నెల నుంచి ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతుండగా… పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారీగా ముఖ్య నాయకులతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు గులాబీ దళపతి. ఇక జన సమీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకుందట బీఆర్‌ఎస్ అధిష్టానం. రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి ఈ సభలో ప్రాతినిధ్యం ఉండాలని అనుకుంటున్నట్టు సమాచారం. భారీ ఎత్తున జనాన్ని తరలించి సత్తా చాటాలనుకుంటున్నారట. అయితే… ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలుగాని, ఆ వాతావరణంగాని లేనందున… జన సమీకరణ అంత తేలికైన పని కాదన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోందట పార్టీలో. మామూలుగా దగ్గర్లో ఎన్నికలుంటే ఆశావహులో… లేదా అధికారంలో ఉంటే అంతా కలిసో జనాన్ని తరలిస్తారుగానీ….. ఆ రెండూ లేనప్పుడు సమీకరణ కష్టమైన వ్యవహారమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట. అందుకే కాస్త డిఫరెంట్‌గా ఆలోచించిన పార్టీ పెద్దలు… ఈ బహిరంగ సభ తర్వాత వెంటనే గ్రామం నుంచి రాష్ట్ర స్థాయిదాకా అన్ని కమిటీలను వేస్తామని ప్రకటించారు.
దీని ద్వారా నాయకుల మధ్య పోటీ పెట్టి ఎక్కువ జన సమీకరణ జరిగేలా చూడాలన్నది ప్లాన్ అట. వరంగల్ బహిరంగ సభకు ఎంత ఎక్కువ మందిని తరలిస్తే… అంత పెద్ద పదవి ఇస్తామని అంతర్గతంగా చెప్పినట్టు సమాచారం. అంటే… పార్టీ రాష్ట్ర కమిటీలో చోటు దక్కాలంటే…. లారీలకు లారీల జనాన్ని తోలాల్సి ఉంటుందన్న మాట. ఇట్స్ యువర్ టైం. మీ సత్తా చూపించే సమయం వచ్చేసింది. జనాన్ని తరలించండి….అంటూ టార్గెట్స్ పెట్టారట గులాబీ పెద్దలు. మీ పదవికి మీరు తీసుకొచ్చే జనమే ప్రామాణికం అని చెప్పినట్టుగా తెలుస్తోంది. అందుకే జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి దాకా… నాయకులు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. ఇదే సమయంలో కొందరికి స్పెషల్ టార్గెట్స్ కూడా పెట్టారట. పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నచోట ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 10వేల మందికి తగ్గకుండా తీసుకురావాలని చెప్పినట్టు తెలిసింది. ఇక ఎమ్మెల్యేలు లేకుండా ఇన్చార్జ్‌లు ఉన్నచోట నాలుగు నుంచి 5 వేల మందిని తరలించాలన్నది లక్ష్యం అట. అలా… అంతా కలిపి 10 లక్షల మందిని సమీకరించాలన్నది టార్గెట్‌గా తెలుస్తోంది. అయితే… పైకి పది లక్షలని గొప్పగా చెబుతున్నా… ఫైనల్‌గా రెండు లక్షల మంది వచ్చినాసరే… సభ గ్రాండ్ సక్సెస్ అన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ముందు పెద్ద టార్గెట్స్ పెడితేనే చివరికి అనుకున్న స్థాయికి జన సమీకరణ జరుగుతుందన్నది పెద్దల లెక్కగా తెలిసింది. ఈనెల 27న నిర్వహించబోయే బహిరంగ సభ తమకు చావో రేవోనని అనుకుంటోందట బీఆర్ఎస్ అధిష్టానం. ఫైనల్‌గా ఎవరు ఎంత మందిని తరలిస్తారో చూడాలి మరి.