
ఊరించి…ఊరించి ఉసూరుమనిపించారా ..? అదిగో..ఇదిగో అంటూ చెప్పి ఆగమాగం చేసేశారా? జరగాల్సిన చర్చలు, రచ్చలన్నీ జరిగిపోయాక ఇప్పుడు తూచ్ అంటున్నారా? తెలంగాణ కేబినెట్ విస్తరణ కథ కంచికేనా? ఇక ఇప్పట్లో ఆ ఊసే ఉండబోదా? ఆ విషయంలో అసలేం జరిగింది? కేబినెట్ విస్తరణ ఉన్నట్టా..? లేనట్టా..? అదిగో…ఇదిగో అంటూ చేసిన చర్చలన్నీ ఉత్తుత్తివేవా? ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌వర్గాలకు వస్తున్న కొత్త ప్రశ్నలివి. వీటికి సమాధానాల కోసం పార్టీలో ఏ నాయకుడిని అడిగినా… ఏమో.. ఎవరికి తెలుసు అన్నదే సమాధానం అట. దాంతో… రాష్ట్ర నేతల సిఫార్సును అధిష్టానం పరిగణనలోకి తీసుకోవడం లేదా..? లేదంటే సరైన ముహూర్తం కుదరడం లేదా..? అన్న అనుమానాలు మొదలయ్యాయట. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే ఏడాదిన్నర గడిచిపోయింది. నిఖార్సుగా, నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే…ఈ సమయం మొత్తం వృధాగాపోయినట్టే. ఆరుగురు నాయకులకు మంత్రి అవకాశం ఆగిపోయినట్టే. ఇంత క్లియర్‌గా ఉన్నా… ఇప్పటిదాకా మంత్రివర్గంలోని ఖాళీల్ని భర్తీ చేయకపోవడానికి కారణాలు ఏంటో అర్ధం కావడం లేదంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. పోనీ… అసలు లేదని చెప్పారా అంటే అదీ కాదు. అదిగో ఇదిగో అంటూ ఎప్పటికప్పుడు ఆశలు రేపుతూనే ఉన్నారు. ముహూర్తాలు పెడుతూనే ఉన్నారు. పార్టీ రాష్ట్ర పెద్దలు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి అదో చర్చ. కానీ విస్తరణ మాత్రం జరగలేదు. దీంతో ఇప్పుడు కొత్తగా ఎందుకు ఆగిందన్న దానికంటే… అసలు విస్తరణ ఉంటుందా..? లేదా అన్నదే ఎక్కువ మందిని వేధిస్తున్న ప్రశ్నఅట. కేబినెట్ విస్తరణ జరుగుతుందని పాలమూరు, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఓ ఎమ్మెల్యే అయితే… ఏప్రిల్ మొదటి వారంలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందన్న ఆశతో… నియోజకవర్గం నుంచి ప్రమాణ స్వీకారానికి వచ్చే నాయకులు..కార్యకర్తల కోసం ఫంక్షన్ హాల్ కూడా బుక్ చేశారట.
తీరా.. ఆ గడువు కూడా పోయింది. ఇప్పుడు అసలు దాని గురించి చర్చ చేయడమే మానేశారు. అదిగో పులి అంటే..ఇదిగో తోక అన్నట్టు తయారైంది తెలంగాణ కేబినెట్ విస్తరణ వ్యవహారం. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కదలిక మొదలైందని మాట్లాడుకోవడం ఏడాదిగా సాగుతూనే ఉంది. ఇక ఏప్రిల్ డెడ్‌లైన్ కూడా ముగిసిపోవడంతో ఇప్పుడా సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవడమే దండగ అని డిసైడయ్యారట మెజార్టీ లీడర్స్. ఐతే.. విస్తరణ వ్యవహారాన్ని సాగదీస్తూ కాంగ్రెస్ అనవసరంగా తలనొప్పులు తెచ్చుకుంటోందన్న అభిప్రాయం సైతం బలపడుతోంది. ఇది పార్టీ పరంగా అంతర్గత సమస్యలకు దారి తీస్తోందట. నాయకుల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. మంత్రి పదవుల గురించి జానారెడ్డి లేఖ రాయడం…ఆయన్ని దృతరాష్ట్రుడు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ చేయడం లాంటివి పార్టీ క్రమశిక్షణని సవాల్ చేస్తున్నాయి. మంత్రి పదవులు మాకంటే మాకు అని నేతలు డిమాండ్ చేసే వరకు రావడం అంటే పరిస్థితి ఏరకంగా ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు. తెలంగాణ కేబినెట్ విస్తరణ అన్నది అంతులేని కథ లాగా నడవడం ఆ పార్టీకి ఏమంత మంచిది కాదంటున్నారు పరిశీలకులు. అదేదో త్వరగా ఫినిష్ చేస్తేనే మంచిదన్న సలహాలు వినిపిస్తున్నాయి.