
అధికారం కోల్పోయాక అక్కడ గులాబీ దళంలో వర్గ పోరుకు బీజం పడిందట. పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం ఆకర్ష మంత్రం జపిస్తుండటం కేడర్‌ను ఇరకాటంలో పెడుతోందట. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టే టార్గెట్‌గా పావులు కదుపుతున్న ఆ ఇద్దరు నాయకులు ఎవరు? ఏ నియోజకవర్గ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే స్కెచ్‌లేస్తున్నారు? ఉమ్మడి పాలమూరు జిల్లా షాద్‌నగర్ గులాబీ నేతల తీరుపై ఇప్పుడు పార్టీలో హాట్ హాట్ చర్చ జరుగుతోందట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా, ఎలా ఉన్నా సరిపోతుందిగానీ… ప్రతిపక్షంలోకి వచ్చాక ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎంత సమన్వయంతో పని చేయాలి? అది మానేసి… ముఖ్యనేతలిద్దరూ లోకల్‌గా పార్టీని నిలువునా చీల్చేస్తున్నారని ఫైరవుతున్నారట కార్యకర్తలు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి వర్గాలుగా షాద్‌నగర్ గులాబీ చీలిపోయిందట. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలొద్దు. ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలొద్దన్నట్టుగా గీతలు గీసేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎవరి దగ్గరికి వెళితే ఎవరికి కోపం వస్తుందోనని ద్వితీయ శ్రేణి నాయకులు సైతం భయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక కేడర్ సంగతైతే చెప్పేపనేలేదు. ఈ క్రమంలో పార్టీ రజతోత్సవ సన్నాహక కార్యక్రమాల్ని సైతం ఎవరికి వారుగానే చేస్తున్నారట. అంతకు ముందు రెండు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అంజయ్య యాదవ్… 2023 ఎలక్షన్స్‌లో ఓడిపోయారు. ఆయనకు వయోభారం కారణంగా… ఎన్నికలకు ముందు నుంచే పార్టీ పనులతో పాటు పాలనా వ్యవహారాల్లో కూడా సపోర్ట్ చేస్తున్నారు కుమారుడు రవి యాదవ్. ప్రస్తుత విపక్ష పాత్రలో కూడా షాద్ నగర్ గులాబీ కేడర్‌కు రవి యాదవే పెద్ద దిక్కుగా ఉన్నారట.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో షాద్‌నగర్ బీఆర్‌ఎస్ టిక్కెట్ తనదేనని ధీమాగా ఉన్నారు రవి. ఇప్పటికే ఎంపిపిగా పనిచేసిన అనుభవానికి తోడు…తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గం మీద పెంచుకున్న పట్టు ప్లస్ అవుతుందన్నది ఆయన లెక్క. ఇదిలా ఉంటే… ఎమ్మెల్సీ కసిరెడ్డి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలిచాక వచ్చిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీ చేసి గెలిచారు నవీన్ కుమార్ రెడ్డి. ఆయనది కూడా షాద్ నగర్ నియోజకవర్గమే కావడం, వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పట్టు బిగించి టికెట్ దక్కించుకోవాలన్న టార్గెట్‌తో అడుగులేస్తుండటంతో… ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైందంటున్నారు కార్యకర్తలు. నవీన్ సిట్టింగ్ ఎమ్మెల్సీ కావడంతో… మొన్నటి వరకు అంజయ్య యాదవ్ వెంట కనిపించిన కొందరు గులాబీ నాయకులు ఇప్పుడు నవీన్ రెడ్డి శిబిరంలో తళుక్కుమంటున్నారట. దీంతో పోరు ఇంకా పెరుగుతోందన్నది లోకల్ వాయిస్. అయితే… అభిప్రాయ భేదాలు ఉంటే ఉండవచ్చుగానీ… షాద్‌నగర్ గులాబీ చీలిపోయిందంటే మాత్రం ఒప్పుకోబోమని అంటోందట ఓ వర్గం. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇచ్చిన హమీలకు అనుగుణంగా పాలన సాగడం లేదని, అధికార పార్టీకి దీటుగా తాము బలంగా ఉన్నామని, ఎంత తన్నుకున్నా మేం మేమే తప్ప మరో పార్టీకి బలం కాబోమని స్థానిక నాయకులు అంటున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో…. ఎవరేం చెప్పినా… భవిష్యత్‌లో షాద్ నగర్ గులాబీ రాజకీయం ఎటు టర్న్ అవుతుందో, ఒకరికే పార్టీ టిక్కెట్ వస్తుంది కాబట్టి రానివాళ్ళు ఎలా మారతారో ఇప్పుడే చెప్పలేమంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.