
తెలుగు రాష్ట్రాల్లో…ఆ భూముల వ్యవహారంపై రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. పార్టీల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు గత చరిత్రను తవ్వుకుంటున్నారు. ఈ భూముల వ్యవహారంలో బీజేపీ నేత ఉన్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే…ఆ ఎంపీ ఎవరో చెప్పాలని కాషాయ నేతలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలిలోని సెంట్రల్ వర్సిటీ భూముల రచ్చరచ్చ అవుతోంది. 400 ఎకరాల భూమి హెచ్‌సీయూకా? ప్రభుత్వానిదా? అనే వివాదం కొనసాగుతూనే ఉంది. 400 ఎకరాల స్కాం వెనుక బీజేపీ ఎంపీ ప్రమేయం ఉందంటూ…బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాంబు పేల్చారు. అక్కడితో ఆగని ఆయన…భూముల వెనుక 10వేల స్కాం జరిగిందని అన్నారు. ఈ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అయితే…కాషాయ పార్టీకి చెందిన ఓ ఎంపీ సంపూర్ణ సహయసహాకారాలు అందిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ట్రస్ట్ అడ్వైజరీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉందని…సదరు కంపెనీ రేవంత్‌రెడ్డికి బ్రోకరిజం చేసిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రస్ట్ అడ్వైజరీ ఇన్వెస్ట్‌మెంట్‌కు 170 కోట్లు లంచం ఇచ్చారంటూ…సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. బీజేపీ ఎంపీకి రేవంత్‌రెడ్డి అనుచిత లబ్ది చేకూరుస్తున్నారని…త్వరలోనే ఆ బీజేపీ ఎంపీ పేరు పెడతాననడం రాజకీయ రచ్చకు దారి తీస్తోంది.
కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు సెటైర్లు వేశారు. ఎవరో ఉన్నారని చెబితే ఎలా ? ముందు ఎంపీ పేరు బయటపెట్టాలంటూ సవాల్ విసిరారు. కేటీఆర్ ఇవాళ బిజెపి ఎంపీ పేరు బయటపెడుతారని భావించారు. ఆయన మాత్రం మరోసారి వాయిదా వేశారు. ఇంతకీ కేటీఆర్ ఆరోపిస్తున్న ఎంపీకి…తెలంగాణతో సంబంధం లేదట. సదరు ఎంపీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారని ప్రచారం జరుగుతోంది. ఆ ఎంపీ పేరు ఇంకా బయటకి రాకపోయినా…వదంతులు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. ఈ భూముల వ్యవహారంలో చక్రం తిప్పిందీ, వ్యవహారాన్ని సమర్థంగా డీల్ చేసిన వ్యక్తి ఆయనేనని కారు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. రఘునందన్ సవాల్‌కు కేటీఆర్ స్పందిస్తారా ? ఆ ఎంపీ పేరును బయట పెడుతారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.