Nidhi Tewari: ప్రధాని మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారి.. ఇంతకీ ఎవరీ అధికారి?

Written by RAJU

Published on:

ప్రధాన మంత్రి కార్యాలయంలో పనిచేయడం అంటేనే ఏ అధికారైనా తన కెరీర్‌లో మైల్ స్టోన్‌గా భావిస్తారు. ప్రధాని కార్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేసే అధికారులు పదుల సంఖ్యలో ఉంటారు. సాధారణంగా వివిధ హోదాల్లో విస్తృతానుభవం గడించిన సీనియర్ అధికారులకు ప్రధాని కార్యాలయంలో ప్రాధాన్యత లభిస్తుంది. అయితే ప్రతిభతో పాటు అంకితభావం, చురుకైన పనితీరు ప్రదర్శిస్తే.. చిన్న వయస్సుల్లోనే ప్రధాని కార్యాలయంలో కీలక బాధ్యతల్ని సైతం చేపట్టవచ్చు. అందుకు తాజా ఉదాహరణగా 2014 బ్యాచ్ ‘ఇండియన్ ఫారిన్ సర్వీసెస్’ (IFS) అధికారిణి నిధి తివారి నిలిచారు. ఆమెను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రైవేట్ సెక్రటరీ (PS)గా నియమిస్తూ అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆఫ్ కేబినెట్ (ACC) మెమో జారీ చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ యువ ఐఎఫ్ఎస్ అధికారిణిపై పడింది.

ఇంతకీ ఎవరీ నిధి? ఇంతకు ముందు ఎక్కడ పనిచేశారు?

నిధి తివారి 2014 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (IFS) అధికారిణి. 2013లో UPSC నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఆమె 96వ ర్యాంక్ సాధించారు. నిజానికి ఈ ర్యాంకు సాధించినవారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)కు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. కొందరు అధికారులు IAS కి అర్హత సాధించినప్పటికీ.. వరుస క్రమంలో ఆ తర్వాత నిలిచే IPS, IFS వంటి సర్వీసుల పట్ల ఆసక్తి ఉంటే.. వాటిని ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. నిధి విషయంలో ఏం జరిగిందో తెలియదు కానీ.. IFS శిక్షణ పూర్తి చేసుకుని ట్రైనీ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే.. అంటే 2016లో అంబాసిడర్ బిమల్ సన్యాల్ మెమోరియల్ మెడల్ అందుకున్నారు. బెస్ట్ ట్రైనీ ఆఫీసర్‌గా నిలిచినందుకు ఈ మెడల్ లభించింది.

విదేశీ వ్యవహారాల శాఖలో డిసార్మమెంట్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అఫైర్స్ విభాగంలో నిధి కొంత కాలం పనిచేశారు. చురుకైన పనితీరు, పని పట్ల అంకితభావం, దేశం పట్ల భక్తి, ప్రతిభ.. ఆమెను 2022లో ప్రధాని కార్యాలయంలోకి తీసుకునేలా చేశాయి. తొలుత అండర్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన నిధి తివారి, 2023 జనవరి 6 నుంచి డిప్యూటీ సెక్రటరీగా పదోన్నతి పొందారు. డిప్యూటీ సెక్రటరీగా ప్రధాని కార్యాలయం (PMO)లో ‘ఫారిన్ అండ్ సెక్యూరిటీ’ విభాగంలో పనిచేశారు. ఇది నేరుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ సారథ్యంలో పనిచేసే విభాగం. ఆమె ఈ విభాగంలో విదేశీ వ్యవహారాలతో పాటు అటామిక్ ఎనర్జీ, సెక్యూరిటీ ఎఫైర్స్ బాధ్యతల్ని నిర్వహించారు. తాజా ఉత్తర్వులతో ఆమె ప్రధానికి ప్రైవేట్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహించనున్నారు.

నిధి తివారీ నేపథ్యం..

నిధి ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలోని మెహ్‌మూర్‌గంజ్ ప్రాంతానికి చెందినవారు. ఆమె ఆలిండియా సర్వీసెస్‌కు ఎంపిక కాకముందు ఆమె వాణిజ్య పన్నుల విభాగంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు. ఆ ఉద్యోగం చేస్తూనే సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం వారణాసి నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తుండడం గమనార్హం.

ప్రధాని కార్యాలయంలో అండర్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ హోదాల్లో పనిచేసిన యువ అధికారుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆమ్రపాలి కాటా కూడా ఉన్నారు. ఆమె ఆ తర్వాత పీఎం కార్యాలయం నుంచి రిలీవ్ అయి సొంత రాష్ట్రానికి వచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రధాని కార్యాలయంలో పనిచేసిన నిధి తివారి నేరుగా ప్రధానికి ప్రైవేట్ సెక్రటరీగా నియమితులవడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ప్రైవేట్ సెక్రటరీలుగా ఇప్పటి వరకు వివేక్ కుమార్, హార్థిక్ సతీష్‌చంద్ర షా ఉన్నారు. నిధి తివారి అదనంగా మరో ప్రైవేట్ సెక్రటరీగా చేరారు.

Subscribe for notification
Verified by MonsterInsights