ప్రపంచ వ్యాప్తంగా కొత్త కొత్త వైరస్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడించిన కరోనా వైరస్ తర్వాత.. కొత్త కొత్త వేరియంట్లు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు దేశంలో మరో కొత్త వేరియంట్ భయాందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ మన దేశంలో ఓ మహిళకు నిర్ధారణ అయ్యింది. కోల్‌కతాలో 45 ఏళ్ల మహిళకు సోమవారం హ్యూమన్ కరోనావైరస్ HKU1 ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ మహిళ గత 15 రోజులుగా తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె దక్షిణ కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతానికి ఆమె పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కోల్‌కతాలోని ఓ మహిళ అత్యంత అరుదైన ‘హ్యూమన్ కరోనా వైరస్’ (హెచ్‌కేయూ1) నిర్ధారణ కావడంతో కొంత ఆందోళన నెలకొంది. చికిత్స పొందుతున్న ఆమెను ఐసొలేషన్ ఉంచినట్టు వైద్యులు తెలిపారు. హెచ్‌కేయూ1 సాధారణంగా తేలికపాటి శ్వాసకోశ వ్యాధులతో ముడిపడి ఉంటుందని, ఇది మహమ్మారిగా మారే అవకాశం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. హెచ్‌కేయూ1 అనేది కరోనా వైరస్‌లోని ‘బీటా కరోనా వైరస్ హాంకానెన్స్’ రకానికి చెందినదని, ఈ వైరస్‌కు ప్రత్యేక చికిత్స, వ్యాక్సిన్ గానీ లేదని చెబుతున్నారు వైద్యులు.
హ్యూమన్ కరోనావైరస్ HKU1 అంటే ఏమిటి?
HKU1 తో సహా సాధారణ మానవ కరోనావైరస్. సాధారణంగా జలుబుతో సహా తేలికపాటి నుండి మితమైన శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి. 229E, NL63, OC34 వంటి వివిధ రకాల వైరస్‌లు ఉన్నాయి.
లక్షణాలు ఏమిటి?
- ముక్కు కారటం
- గొంతు నొప్పి
- తలనొప్పి
- జ్వరం
- దగ్గు
- తీవ్రమైన సందర్భాల్లో ఇది న్యుమోనియా లేదా బ్రోన్కైటిస్‌కు కూడా కారణమవుతుంది.
ఈ వైరస్ వల్ల ఎవరికి ఎక్కువ ప్రమాదం:
కార్డియోపల్మోనరీ వ్యాధి, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు, శిశువులు, కొమొర్బిడిటీలు ఉన్న వృద్ధులు ప్రమాదంలో ఉంటారు.
ఎలా నివారించాలి?
కోవిడ్-19 సమయంలో తీసుకున్న చర్యలు HKU1 ని ఎదుర్కోవడంలో కూడా ఉపయోగపడతాయి.
1. మీ చేతులను తరచుగా సబ్బు, నీటితో కనీసం 20 సెకన్ల పాటు కడుక్కోండి.
2. కడుక్కోని చేతులతో మీ కళ్ళు, ముక్కు లేదా నోటిని తాకకుండా ఉండండి.
3. అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాన్ని నివారించండి
4. మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండండి
5. ఇతరులతో సన్నిహిత సంబంధాన్ని నివారించండి
6. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మీ నోరు, ముక్కును కప్పుకోండి
7. వస్తువులు, ఉపరితలాలను శుభ్రపరచండి.
ఇలాంటి వైరల్ నుండి రక్షించడానికి టీకా లేనప్పటికీ, చాలా మంది ప్రజలు స్వయంగా కోలుకుంటారు. ఎక్కువగా పండ్ల రసాలు తీసుకోవడం, ఎక్కువగా నీళ్లు తాగడం, విశ్రాంతి తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి