2024-25లో రూ.1,114 కోట్లు ఇచ్చిన కేంద్రం
కేటాయింపులకన్నా 18@ అదనం
హైదరాబాద్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎమ్) కార్యక్రమాలకు కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా నిధులు విడుదల చేసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా రూ.1,000 కోట్లకుపైగా నిధులు వచ్చాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.938 కోట్లు కేటాయించగా.. తొలిసారిగా కేటాయించిన దానికంటే ఎక్కువగా (రూ.1,114.91 కోట్లు) విడుదల చేసింది. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి గత ఆర్థిక సంవత్సరం వరకు ఎన్‌హెచ్‌ఎమ్ నిధుల విషయంలో కేంద్రం చిన్నచూపు చూసింది. కేటాయింపుల కంటే తక్కువగా నిధులు విడుదల చేసింది. రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి 2024 వరకు కేంద్రం ఎన్‌హెచ్‌ఎం కింద రూ.7,010 కోట్లు కేటాయించింది. అయితే ఇందులో రూ.5,952 కోట్లే విడుదల చేసి రూ.1,058 కోట్లను పెండింగ్‌లో పెట్టింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరాన్ని కూడా కలిపితే రాష్ట్రానికి మొత్తం రూ.7,950 కోట్లు కేటాయించగా, అందులో రూ.7,076 కోట్లనే విడుదల చేసింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గతేడాది వరకు ప్రతి ఏటా కేటాయింపుల కంటే తక్కువగా నిధులను కేంద్రం విడుదల చేస్తూ వచ్చింది. అందుకు అనేక కారణాలున్నాయి. గత బీఆర్‌ఎస్ సర్కారు కేంద్రం ఇచ్చే ఎన్‌హెచ్‌ఎమ్ నిధులను రాష్ట్ర ఆరోగ్య పథకాల కింద ఉపయోగించింది. దాంతో కేంద్రం నిధుల విడుదల పూర్తిస్థాయిలో చేయలేదు. కేంద్ర నిధులను రాష్ట్ర సర్కారు సొంత పథకాలకు వాడుకుంటోందనే అభిప్రాయం కేంద్రంలో ఏర్పడింది. గతంలో ఎన్‌హెచ్‌ఎమ్ ఎండీలు నిధుల కోసం గట్టిగా ప్రయత్నించలేదు. గత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి మధ్య సఖ్యత లేకపోవడమూ నిధుల విడుదలకు అడ్డంకిగా మారింది. 2023-24లో రాష్ట్రానికి ఎన్‌హెచ్‌ఎమ్ కింద రూ.888 కోట్లు కేటాయించినా రూ.564 కోట్లే ఇచ్చింది. అంతకుముందు ఏడాది రూ.172కోట్లు తక్కువ ఇచ్చింది.
కాంగ్రెస్ వచ్చాక నిధులపై ప్రత్యేక దృష్టి..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్‌హెచ్‌ఎమ్ నిధులపై ప్రత్యేక దృష్టిసారించింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కేంద్రానికి పలుమార్లు లేఖలు రాయగా.. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి రాష్ట్రానికి రావాల్సిన ఎన్‌హెచ్‌ఎమ్ నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. తర్వాత ఎన్‌హెచ్‌ఎమ్ ఎండీ కర్ణన్ ఫాలోఅప్ చేశారు. దాంతో నిధుల విడుదలను కేంద్రం వేగవంతం చేసింది. ఎన్‌హెచ్‌ఎమ్ కార్యక్రమాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పకడ్బందీగా అమలు చేస్తూ వస్తోంది. ముఖ్యంగా అసాంక్రమిత వ్యాధులైన (ఎన్‌సీడీ) బీపీ, షుగర్ పరీక్షలను దేశంలో ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణలో బాగా చేస్తున్నారు. ఎన్‌హెచ్‌ఎమ్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇతర రాష్ట్రాల కంటే వేగంగా, మెరుగ్గా రాష్ట్రంలో నిర్వహిస్తుండటంతో కేంద్రం దృష్టి పడింది. ఈ నేపథ్యంలో ఎన్‌సీడీపై నేషనల్ కాన్ఫరెన్స్‌ను ఢిల్లీలోకాకుండా తొలిసారి హైదరాబాద్‌లో గత జనవరి 8, 9 తేదీల్లో నిర్వహించింది. ఈ సమావేశానికి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాఽధికారులు, అన్ని రాష్ట్రాల ఎన్‌హెచ్‌ఎమ్ ఎండీలు, ఇతర అధికారులు హాజరయ్యారు. వెరసీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహి స్తున్న ప్రోగ్రామ్‌పై కేంద్రానికి సానుకూల దృక్పథం ఏర్పడింది. ఎన్‌హెచ్‌ఎమ్ నిధులను ఈసారి దండిగా విడుదల చేసింది.
ఈ వార్తలు కూాడా చదవండి
Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..
Read Latest Telangana News And Telugu News
Updated Date – Apr 01 , 2025 | 06:21 AM