ABN
, Publish Date – Mar 23 , 2025 | 05:02 AM
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కూటమి ప్రభుత్వం చారిత్రక రికార్డు సృష్టించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.

రైతుల ఖాతాల్లో రూ.8,003 కోట్లు జమ : మంత్రి మనోహర్
తెనాలి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్ల విషయంలో కూటమి ప్రభుత్వం చారిత్రక రికార్డు సృష్టించిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ ఖరీ్‌ఫలో 34.78 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతుల ఖాతాల్లో ఏకంగా రూ.8,003 కోట్లు జమ చేసిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే 18 శాతం అదనంగా ధాన్యాన్ని కొనగలిగామని చెప్పారు. తెనాలిలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. వైసీపీ పాలనలో 5,690 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, డబ్బు మాత్రం ఎనిమిది నెలల వరకు రైతులకు ఖాతాల్లో వేసిన దాఖలాలు లేవని తెలిపారు. ఇంకా రూ.1674 కోట్లు చెల్లించకుండానే బకాయి పెట్టి వెళ్లిపోయారని, వాటిని కూడా తాము చెల్లించామని చెప్పారు. కాగా, వచ్చే రబీ పంట కాలానికి కూడా ఇప్పుడు ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని.. జొన్న, మొక్కజొన్న, అపరాల వంటి రబీ ఉత్పత్తులను కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.
గత వైసీపీ ప్రభుత్వంలో పౌరసరఫరాల శాఖలో ఒక్క నెల్లూరు జిల్లాలోనే భారీ కుంభకోణం జరిగిందని, ఈ కుంభకోణంలో మేలు చేసి పెట్టినందుకు గత ప్రభుత్వంలోని పెద్దల నుంచి అత్యంత ఖరీదైన రోలెక్స్ వాచ్‌లు, స్కోడా కార్లను ఉద్యోగులు బహుమతిగా పొందారని, నేతలు కూడా రూ.కోట్లకు పడగలు ఎత్తారని ఆరోపించారు. ఆ గుట్టు కూడా బయటకు తీస్తున్నామని మంత్రి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోసం నాణ్యమైన సన్న బియ్యాన్ని అందించనున్నామని మంత్రి మనోహర్ తెలిపారు.
Updated Date – Mar 23 , 2025 | 05:02 AM