ప్రధాని మోదీ ఇవాళ నాగ్‌పూర్‌లోని RSS కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి స్మృతి మందిర్‌లో RSS వ్యవస్థాపకులు హెడ్గేవార్, గోల్వాల్కర్‌కు నివాళులు అర్పించారు. నాగపూర్‌లోని మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్‌కు ప్రధాని ఆదివారంనాడు శంకుస్థాపన చేశారు. నాగ్‌పూర్‌లోని మాధవ్ నేత్రాలయ ఐ ఇన్‌స్టిట్యూట్ & రీసెర్చ్ సెంటర్‌కు అప్‌గ్రేడ్‌గా ఇది నిర్మితం అయింది. కొత్త ప్రాజెక్టులో 250 పడకల ఆసుపత్రి, 14 ఔట్ పేషెంట్ విభాగాలు (OPDలు), 14 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ఉంటాయి
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దేశ అజరామర సంస్కృతికి మహావృక్షంగా మోదీ అభివర్ణించారు. సేవకు పర్యాయపదమన్నారు. దేశం ‘వికసిత్ భారత్’ దిశగా సాగుతున్న తీరులో.. వందేళ్లలో ఆరెస్సెస్ చేసిన కృషి ఎంతో ఉందన్నారు. సంఘ్ కార్యకర్తలు వివిధ రంగాల్లో ఎంతో సేవ చేస్తున్నారని ప్రధాని కొనియాడారు. అటల్ బిహారీ వాజ్‌పేయీ తర్వాత RSS ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన రెండో సిట్టింగ్ ప్రధానిగా మోదీ నిలిచారు. అనంతరం 1956లో డా.బీఆర్ అంబేడ్కర్ బౌద్ధమతాన్ని స్వీకరించిన ‘దీక్షభూమి’ని ప్రధాని సందర్శించారు. అభివృద్ధి చెందిన, సంఘటిత భారత్‌ను నిర్మించడమే.. అంబేడ్కర్‌కు నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు. కాగా నాగ్‌పూర్ పర్యటన తనకు ఎంతో ప్రత్యేకం అంటూ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో వీడియోను పంచుకున్నారు.
Here are highlights from a very special Nagpur visit! Thankful to the people of Nagpur for the affection. pic.twitter.com/9rKMXi1AXk
— Narendra Modi (@narendramodi) March 30, 2025
“మోదీ జీ ఒక ‘స్వయంసేవక్’. ఆయన ఒక ‘ప్రచారక్’. నేటికీ ఆయన జీవితం ‘ప్రచారక్’ లాంటిదే. ఆయన అనుభవం, ఆయన భావోద్వేగాలు.. నేటి ప్రసంగంలో మిళితం అయ్యాయి. మేము కూడా ‘స్వయంసేవక్’గా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాం” అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..