
మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో సంభవించిన భూకంపం తీవ్రత ఎవరూ ఊహించని స్థాయిలో ఉంది. అయితే ఈ భూకంపం సాధారణమైంది కాదు.. 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు. మయన్మార్‌లో భూకంప విలయంలో మరణించిన వారి సంఖ్య 1700 దాటింది. కొన్ని వేలమంది క్షతగాత్రులయ్యారు. అనేక మంది ఆచూకీ ఇప్పటికీ అంతుచిక్కని జాడగానే మిగిలిపోయింది. 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు ఈ స్థాయిలో విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం సాధారణమైంది కాదని అంటున్నారు శాస్త్రవేత్తలు.. 334 అణుబాంబులకు సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ తెలిపారు. అంతేకాదు రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.
టెక్టానిక్ ఫలకాలు యురేషియన్ ప్లేట్స్‌ను వరుసగా ఢీకొంటుండడం వల్ల నెలల తరబడి ఆఫ్టర్‌షాక్స్ వచ్చే అవకాశం ఉందని జెస్ ఫీనిక్స్ తెలిపారు. దేశంలో కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా మయన్మార్ విపత్తు మరింత తీవ్రమవుతుందని ఆమె హెచ్చరించారు. కమ్యూనికేషన్‌లో అంతరాయం వల్ల అక్కడి పూర్తిస్థాయి పరిస్థితులను బాహ్య ప్రపంచం గుర్తించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులోనే ప్రకంపనల కేంద్రాలు ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ విపత్తు వల్ల చనిపోయిన వారి సంఖ్య 10వేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ అంచనా వేసింది.
మయన్మార్‌లో 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం అనేక నగరాలపై తీవ్ర ప్రభావం చూపింది. మాండలేలో భారీ భవనాలు, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రదేశాలతోపాటు అనేక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వంతెనలు కూలిపోవడం, రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్న కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. రెండు రోజులుగా వరుస భూ ప్రకంపనలు మయన్మార్‌వాసులను హడలెత్తిస్తున్నాయి. వరుస ప్రకంపనల కారణంగా దెబ్బతిన్న ఇళ్లు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందనే భయం స్థానికుల్లో నెలకొంది. దీంతో 15 లక్షల జనాభా ఉన్న మాండలేలో చాలావరకు ప్రజలు రాత్రి వేళల్లో వీధుల్లోనే నిద్రపోతున్నారు. థాయ్‌లాండ్‌లో 33 అంతస్తుల నిర్మాణ భవనం కుప్పకూలగా.. అందులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే వారు బతికుండే అవకాశాలు చాలా తక్కువని బ్యాంకాక్ పోలీసులు వెల్లడించారు. శిథిలాలను పూర్తిగా తొలగించేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందని తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..