MP Engineer Rashid’s bail plea dismissed in terror funding case

Written by RAJU

Published on:

  • ఎంపీ ఇంజనీర్ రషీదుకు బెయిల్ తిరస్కరణ..
  • ఎంపీ హోదా జైలు శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వదన్న ఎన్ఐఏ..
MP Engineer Rashid’s bail plea dismissed in terror funding case

Engineer Rashid: ఉగ్రవాద నిధుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్‌కి ఢిల్లీ కోర్టు బెయిల్ తిరస్కరించింది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చారనే ఆరోపణల కారణంగా రషీద్ 2019 నుంచి జైలులో ఉన్నాడు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ బారాముల్లా నుంచి ఎంపీగా గెలిచిన రషీద్, పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఎంపీగా అతడి హోదా అతడి జైలు శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వదని ఎన్ఐఏ కోర్టులో వాదించింది. ఎన్ఐఏ వాదనలతో ఏకీభవించిన కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ని కొట్టివేస్తుందని అదనపు సెషన్స్ జడ్జి చందర్ జిత్ సింగ్ తీర్పు చెప్పారు.

Read Also: PSL: పీఎస్ఎల్ ఫ్రాంచైజ్‌లో రోహిత్ శర్మ వాయిస్.. ఫ్యాన్స్ ఫైర్ (వీడియో)

2017 ఉగ్రవాద నిధుల కేసులో చట్టవిరుద్ధ కార్యకలాపాలు(నివారణ) చట్టం(యూఏపీఏ) కింద ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత 2019 నుంచి రషీద్ తీహార్ జైలులో ఉన్నాడు. ఏప్రిల్ 04 వరకు జరగనున్న లోక్‌సభ సమావేశాల కోసం తనకు కస్టడీ పెరోల్ లేదా మధ్యంతర బెయిల్ నిరాకరించిన ట్రయల్ కోర్టు ఉత్తర్వులను మార్చి 10న ఢిల్లీ కోర్టులో సవాల్ చేశాడు. మార్చి 17న, రషీద్ పిటిషన్‌కి స్పందించిన ఎన్ఐఏ, అతడి ఎంపీ హోదా ఉపయోగించుకోవడానికి అనుమతించమని చెప్పింది. చట్టబద్ధమైన కస్టడీలో ఉన్నప్పుడు పార్లమెంటు సమావేశాలకు హాజరు కావడానికి రషీద్‌కు ఎటువంటి హక్కు లేనందున అతనికి మధ్యంతర బెయిల్ లేదా కస్టడీ పెరోల్ మంజూరు ఇవ్వొద్దని ఏజెన్సీ వాదించింది.

కాశ్మీర్‌లో సాయుధ గ్రూపులు, ఉగ్రవాద సంస్థలు, వేర్పాటువాదులకు నిధులు సమకూర్చాలనే ఆరోపణలపై ఎన్ఐఏ కాశ్మీర్‌కి చెందిన వ్యాపారవేత్త జహూర్ వాటాలిని అరెస్ట్ చేసింది. ఈ కేసులోనే ఇంజనీర్ రషీద్ ప్రమేయం వెలుగులోకి వచ్చింది. వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ సహా అనేక మందిపై ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది యాసిన్ మాలిక్ తన నేరాన్ని అంగీకరించడంతో 2022లో ట్రయల్ కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది.

Subscribe for notification