Cancer: ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు క్యాన్సర్ కు ట్రీట్‌మెంట్ ఉండేది కాదు. కానీ, ఇప్పుడు అడ్వాన్స్‌డు ట్రీట్‌మెంట్ అందుబాటులోకి రావడంతో మరణాల రేటు కొద్దిగా తగ్గింది. అయితే, క్యాన్సర్ నయమైనా మళ్లీ తిరిగి వస్తుందా? అని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. చికిత్స చేసిన తర్వాత కూడా క్యాన్సర్ కణాలు తిరిగి పెరుగుతాయని అనుకుంటారు. అయితే, దీనిలో నిజమెంత? ట్రీట్‌మెంట్ తర్వాత కూడా క్యాన్సర్ మళ్లీ వస్తుందా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
మళ్లీ వస్తుంది..
ట్రీట్‌మెంట్ తర్వాత కూడా క్యాన్సర్ మళ్లీ వస్తుందనేది నిజం. అయితే, కొన్ని రకాల క్యాన్సర్లు మాత్రం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ రకం, క్యాన్సర్ ఎంత వేగంగా పెరుగుతుంది, ఏ దశలో మనం దానిని మొదట గుర్తించాము అనే దానిపై ఆధారపడి ఉంటుంది. క్యాన్సర్ పునరావృతం కొన్ని నెలల తర్వాత లేదా చాలా సంవత్సరాల తర్వాత కూడా సంభవించవచ్చు. మునుపటిలాగే క్యాన్సర్ ఉన్న సమీప ప్రాంతాలలో లేదా శరీరంలోని మరొక భాగంలో రావొచ్చు.
మెదడు క్యాన్సర్..
మెదడు క్యాన్సర్ దాదాపు 100% పునరావృతమవుతుందని వైద్యులు గుర్తించారు. మూత్రాశయం తొలగించిన తర్వాత కూడా 30-54% మందిలో మూత్రాశయ క్యాన్సర్ పునరావృతమవుతుంది. కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్ చికిత్స తర్వాత మొదటి ఐదు సంవత్సరాలలో తిరిగి వస్తుంది. హార్మోన్ రిసెప్టర్-పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వంటివి చాలా సంవత్సరాల తర్వాత కూడా తిరిగి రావచ్చు.
క్యాన్సర్ లక్షణాలు..
క్యాన్సర్ రకాన్ని బట్టి, అది ఎక్కడ సంభవిస్తుందో బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. గడ్డలు లేదా వాపు, నిరంతర పుండ్లు, నిరంతర దగ్గు లేదా గొంతు నొప్పి, వివరించలేని బరువు తగ్గడం లేదా పెరగడం, విపరీతమైన అలసట కొన్ని సాధారణ క్యాన్సర్ లక్షణాలు. వీటితో పాటు రాత్రిపూట చెమటలు పట్టడం, మలబద్ధకం లేదా విరేచనాలు, మూత్రవిసర్జనలో మార్పు, మలం లేదా మూత్రంలో రక్తం, కడుపు నొప్పి, కామెర్లు లేదా మూత్రవిసర్జన సమయంలో నొప్పి, ప్రేగు కదలికలలో మార్పులు మొదలైనవి క్యాన్సర్ తిరిగి వచ్చే లక్షణాలు.
వీటికి దూరంగా ఉండండి..
రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు చేయడం ద్వారా క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించవచ్చు. వీటితో పాటు సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం అవసరం. ధూమపానం, మద్యపానం మానేస్తే ఆరోగ్యానికి మంచిది. ఒత్తిడికి గురికాకండి. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ధ్యానం చేయండి. డాక్టర్ సూచించిన చికిత్సను సరిగ్గా అనుసరించండి. ఏదైనా కొత్త లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)