Minister Uttam Kumar: కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో నీటి ఎద్దడి

Written by RAJU

Published on:


ABN
, Publish Date – Mar 19 , 2025 | 07:03 AM

మాజీ సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో నీటి ఎద్దడి ఏర్పడిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు.

 Minister Uttam Kumar: కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో నీటి ఎద్దడి

  • దేవన్నపేట పంప్‌హౌస్‌ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి ఉత్తమ్‌

  • పనులు జరుగుతుండడంతో అధికారులతో సమీక్ష

హనుమకొండ టౌన్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో నీటి ఎద్దడి ఏర్పడిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా హనుమకొండలోని దేవన్నపేటలో నిర్మాణంలో ఉన్న పంప్‌హౌస్‌ పనులను మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డితో కలిసి ఉత్తమ్‌ పరిశీలించారు. మంత్రులు మోటార్లు ప్రారంభించడానికి వచ్చినప్పటికీ అక్కడ పంప్‌హౌస్‌ పనులు జరుగుతున్నందున అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి దేవాదుల పంప్‌ హౌస్‌ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, దీంతో రాష్ట్రంలో నీటి ఎద్దడి ఏర్పడిందని ఉత్తమ్‌ ఆరోపించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పంటలు ఎండిపోకుండా ఉండేందుకు ఫేజ్‌-3లో మోటార్లను ఆన్‌చేసేందుకు వచ్చినట్లు తెలిపారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో బుధవారం జరగాల్సిన కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించినట్లు తెలిపారు. ఎంత ఆలస్యమైనా మోటార్లు ఆన్‌ చేసి వెళ్తామని చెప్పారు. 18 నెలల్లో పెండింగ్‌లో ఉన్న దేవాదుల పనులను పూర్తిచేస్తామని మంత్రి ఉత్తమ్‌ స్పష్టం చేశారు.

మంత్రుల పర్యటన మార్పుతో హడావిడి

మొదట నిర్ణయించిన ప్రకారం మోటార్లు ఆన్‌చేసే కార్యక్రమం బుధవారం జరగాల్సి ఉండగా, అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశం ఉన్నందున పర్యటనలో మార్పు చేశారు. మంత్రుల పర్యటన మారడంతో అధికారులు, పోలీసు సిబ్బంది ఏర్పాట్లు చేయడంలో కొంత ఇబ్బంది పడ్డారు. మరోవైపు పంప్‌హౌజ్‌ మరమ్మతు పనులు పూర్తవకుండా, ట్రయల్‌రన్‌ చేయకుండా మోటార్లు ఆన్‌చేసేందుకు మంత్రులు రావడం, పనుల పూర్తయ్యేదాకా వేచిచూస్తామనడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆస్ట్రియా నుంచి వచ్చిన ప్రత్యేక బృందం మరమ్మతు పనులను కొనసాగిస్తుండటంతో పాటు సాంకేతిక సమస్య కారణంగా మంత్రులు ట్రయల్‌ రన్‌ను ప్రారంభించలేకపోయారు. తాము రాత్రి ఎంత ఆలస్యమైనా ఉండి మోటార్లను ఆన్‌చేసి వెళ్తామని స్పష్టం చేసిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి వరంగల్‌ నిట్‌లో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి వెళ్లారు.

Updated Date – Mar 19 , 2025 | 07:03 AM

Google News

Subscribe for notification