ABN
, Publish Date – Mar 25 , 2025 | 05:20 AM
తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ కేసులపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. గ్రామంలో పూర్వం ఉన్న కేసులు, ప్రస్తుత అనుమానిత కేసులు కలిపి 38 దాటకపోవచ్చని, 31 వైద్య బృందాలతో క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలు కొనసాగుతున్నట్లు తెలిపారు

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు.. జాతీయ, రాష్ట్ర స్థాయితో పోల్చితే సాధారణ స్థాయిలోనే ఉన్నాయని, ఈ విషయంలో ఆందోళన అక్కర్లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ అన్నారు. అక్కడ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని స్పష్టం చేశారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అనపర్తి శాసనసభ్యులు బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవడంతోపాటు మరణాలు కూడా సంభవిస్తున్నాయని సభ దృష్టికి తెచ్చారని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గ్రామంలో సమగ్ర క్యాన్సర్ సర్వేను ప్రారంభించామని తెలిపారు. సేకరించిన వివరాల ప్రకారం ఈ గ్రామంలో పూర్వం ఉన్న కేసులు, ప్రస్తుత అనుమానిత కేసులు మొత్తం కలిపి 38 దాటకపోవచ్చని తెలిపారు. సర్వేలో అనుమానిత కేసులుగా 38 మందిని గుర్తించగా.. వాటిలో 10-15 శాతమే పాజిటివ్‌గా తేలే అవకాశం ఉందన్నారు. గ్రామంలో 31 వైద్య బృందాలతో సార్వత్రిక క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కాగా, డీలిమిటేషన్ ప్రక్రియకు ఓ ప్రత్యేక విధానం ఉంటుందని మంత్రి సత్యకుమార్ అన్నారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఎవరూ నిర్ధారించలేదన్నారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని కుటుంబ పార్టీలే ఈ తరహా వాదన తెస్తున్నాయన్నారు.
ఆయుష్ సేవలను విస్తరించాలి: సత్యకుమార్
ఆయుష్ సేవలకు రాష్ట్రంలో పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ సేవలను మరింత విస్తరించేలా ప్రణాళికలు చేపట్టాలని మంత్రి సత్యకుమార్ అధికారులను ఆదేశించారు. సచివాయంలో ఆయుష్ సేవలపై ఆయన అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని 1,188 ఆయుష్ డిస్పెన్సరీల్లో డాక్టర్ల కొరత 50 శాతం ఉన్నట్లు సమీక్షలో వెల్లడికాగా.. ఈ ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని సూచించారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date – Mar 25 , 2025 | 05:21 AM