- RTC సమ్మె నోటీస్ పై స్పందించిన రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్
- RTC భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమ్మె పై పునరాలోచించాలి…
- ప్రస్తుతం సమ్మె చేయాల్సిన పరిస్థితుల్లో ఆర్టీసీ లేదు…
- ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది…
- ఆర్టీసీ కార్మికుల పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

TGSRTC Strike: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సమ్మె నోటీసుపై స్పందిస్తూ.. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమ్మెపై పునరాలోచించాలని కోరారు. ఈ సమయంలో ఆర్టీసీ సమ్మెకు అనుకూల పరిస్థితులు లేవని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి పూర్తిగా సానుకూలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పోరాటం ఎంతో కీలకంగా నిలిచిందని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ వంటి అంశాల పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
Read Also: CM Revanth Reddy: తెలంగాణ నిర్ణయాన్ని దేశం అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉంది..!
ఇప్పటివరకు తాను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్మికులు తనను కలవలేదని మంత్రి పేర్కొన్నారు. నేరుగా లేబర్ కమిషన్‌ను కలిసి నోటీసు ఇచ్చారని తెలిపారు. ఉద్యమకారుడిగా తనకు ఆర్టీసీతో ప్రత్యేక అనుబంధం ఉందని, కార్మికులతో సమాలోచనలకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి స్పష్టం చేశారు. గత పదేళ్లుగా ఆర్టీసీ అభివృద్ధిలో నిలకడగా నడవలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని బకాయిలను విడుదల చేస్తోందని మంత్రి వివరించారు. ఆర్టీసీ ఇప్పుడు లాభాల బాటలో నడుస్తోందని, సంస్థ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఈ నేపథ్యంలో, కార్మికులు తగిన ఆత్మపరిశీలనతో ముందడుగు వేసి, సమ్మె నిర్ణయంపై పునరాలోచించాలని మంత్రి విజ్ఞప్తి చేసారు.