Minister: జూన్‌ 1 నుంచే పాఠశాలలు

Written by RAJU

Published on:

పెరంబూర్‌(చెన్నై): వేసవి సెలవుల అనంతరం జూన్‌ 1వ తేది నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌(Minister Anbil Mahesh) తెలిపారు. రాష్ట్ర పాఠ్య ప్రణాళికలో 2022-23 విద్యా సంవత్సరంలో టెన్త్‌, ప్లస్‌ వన్‌, ప్లస్‌ టూ పబ్లిక్‌ పరీక్షలు, 1 నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు ముగియడంతో శుక్రవారం నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, స్థానిక సచివాలయంలో శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ… 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 6 నుంచి ప్లస్‌ టూ వరకు జూన్‌ 1వ తేదీన, 1 నుంచి 5వ తరగతి వరకు 5వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. పాఠశాలలు ప్రారంభించిన వెంటనే విద్యార్థులకు ఉచితంగా పాఠ్య, నోటు పుస్తకాలు, విద్యా సామగ్రి సకాలంలో అందిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప్లస్‌ టూ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 18 నుంచి, ప్లస్‌ వన్‌ పరీక్షలు 19 నుంచి, టెన్త్‌ పరీక్షలు ఏప్రిల్‌ 8వ తేది నుంచి ప్రారంభమవుతాయని తెలిపారు. ఇక వేసవి సెలవుల్లో విద్యార్థులు జలాశయాల వద్దకు వెళ్లకుండా ఉండేలా తల్లిదండ్రులు గమనించాలన్నారు. అదే సమయంలో తమ పిల్లలను సమీపంలోని గ్రంథాలయాలకు తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500లకు పైగా పాఠశాలల స్థాయి పెంచాలని కోరుతున్నారని, ఈ విషయమై నిబంధనల మేరకు స్థాయి పెంచే విషయం పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో వేసవి ఎండలు అధికంగా ఉంటే పాఠశాలల పునఃప్రారంభంపై సీఎం స్టాలిన్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పబ్లిక్‌ పరీక్షల మూల్యాంకనంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తక్కువ మార్కులు వేస్తున్నారనే వదంతులను నమ్మవద్దని కోరారు. మూల్యాంకనంలో ఆన్సర్‌షీట్లు ఎవరివో, ఏ ప్రాంతానివో తెలిసే అవకాశం లేదన్నారు. మూల్యాంకనం ముగిసి మార్కులు వేసే సమయంలో మాత్రమే ఏ పాఠశాలకు చెందినవో తెలుస్తుందని, అందువల్ల సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలను నమ్మవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Subscribe for notification