ఇంటర్నెట్ డెస్క్: బబుల్‌గమ్ లేదా చూయింగ్ గమ్‌లను చిన్నతనాల్లో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే ఉంటారు. ఎలాంటి హానీ లేని కారణంగా బబుల్‌గమ్ అలవాటును కొందరు పెద్దయ్యాక కూడా కొనసాగిస్తుంటారు. అయితే, బబుల్ గమ్ కారణంగా నోట్లోకి మైక్రోప్లాస్టిక్స్ చేరుతున్నాయని కొందరు పరిశోధకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన అధ్యయనం ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణం ఉన్న సూక్ష్మ ప్లాస్టిక్ కణాలను మైక్రో ప్లాస్టిక్స్ అని అంటారు. వీటితో ప్రమాదాలపై ప్రస్తుతం శాస్త్ర వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎత్తైన పర్వత శిఖరాలు మొదలు సముద్రపు లోతుల వరకూ.. చివరకు మనిషి ఊపిరితిత్తులు రక్తం, మెదుడలో కూడా మైక్రోప్లాస్టిక్స్‌ను గుర్తించారు. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సకు సరైన సమయం ఇదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఇక తాజా అధ్యయనాన్ని యూనివర్సిటీ ఆఫ్ కాలఫోర్నియాకు చెందిన డా. సంజయ మొహంతీ నిర్వహించారు. బబుల్ గమ్ నమలడం ద్వారా కూడా నోట్లోకి మైక్రో ప్లాస్టిక్స్ చేరుతున్నాయని చెప్పారు. ఈ అధ్యయనం కోసం ఓ వ్యక్తి అమెరికాలోని 10 బ్రాండ్స్‌కు చెందిన బబుల్ గమ్స్‌ను నమిలారు. ఆ తరువాత లాలా జలాన్ని పరీక్షించగా ఒక్కో గ్రాము బబుల్‌గమ్ నుంచి 100 మైక్రో ప్లాస్టిక్స్ కణాలు విడుదలైనట్టు తేలింది. కొన్ని బ్రాండ్స్ ఏకంగా 600 సూక్ష్మ ప్లాస్టిక్ కణాలను విడుదల చేశాయట. ఈ లెక్కన ఏటా 180 బబుల్ గమ్‌లను నమిలే వారి శరీరంలోకి 30 వేల మైక్రో ప్లాస్టిక్స్ కణాలు చేరుతున్నట్టు తేల్చారు. అయితే, ఈ అధ్యయనంతో ఆందోళన చెందాల్సిందేమీ లేదని కూడా అధ్యయనకారులు పేర్కొన్నారు.
ఇందుగలడు.. అందులేడన్నట్టు విశ్వవ్యాప్తం అవుతున్న మైక్రోప్లాస్టిక్స్ గురించి తెలియజెప్పడమే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. మైక్రోప్లాస్టిక్స్‌కు బబుల్ గమ్ ప్రధాన కారణమని కూడా పేర్కొన్నారు. ప్లాస్టిక్ బాటిల్స్‌లోని లీటరు నీటిలో సుమారు 2.4 లక్షల మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్టు గతేడాది విడుదలైన ఓ అధ్యయనం తేల్చింది.
Also Read: నవజాత శిశువుల గురించి మీకీ ఆసక్తికర విషయాలు తెలుసా
అయితే, ఈ అధ్యయనంపై ఓ శాస్త్రవేత్త తన సందేహం వ్యక్తం చేశారు. పరిశోధన సందర్భంగా వినియోగించిన పరికరాలు కూడా కొంత వరకూ మైక్రోప్లాస్టిక్స్‌కు కారణమై ఉండొచ్చని అన్నారు. బబుల్ గమ్స్ మైక్రోప్లాస్టిక్స్ కనబడటంలో వింతేమీ లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్లాస్టిక్ వస్తువుల తయారలో వాడే రసాయనాలనే బబుల్ గమ్ తయారీకి వాడుతున్నప్పుడు ఆశ్చరయపోవాల్సిందేమి ఉందని ప్రశ్నించారు. ఈ అధ్యయనంపై మరో శాస్త్రవేత్త కూడా స్పందించారు. బబుల్‌గమ్ ద్వారా విడుదలయ్యే మైక్రోప్లాస్టిక్స్ సంఖ్య తక్కువేనని, ఇవి మలం ద్వారా బయటకు పోతాయని తెలిపారు.
ఈ అధ్యయనంపై బబుల్ గమ్ తయారీ సంస్థల సంఘం నేషనల్ కన్ఫెషనరీస్ అసోసియేషన్ కూడా స్పందించింది. ఈ అధ్యయంతో ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని స్వయంగా సంబంధిత శాస్త్రవేత్తలే పేర్కొన్నారని వ్యాఖ్యానించింది. వందల ఏళ్లుగా మనుషులు వినియోగిస్తున్న బబుల్‌గమ్‌తో వచ్చే ముప్పేమీ లేదని, దీని తయారీలో వాడే ముడిసరుకులన్నీ అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఉన్నవేనని పేర్కొంది.
Read Latest and Health News