దేశ దిశ

Meerut: పామును అద్దెకు తెచ్చి భర్తను హతమార్చిన భార్య.. అసలు విషయం తెలిస్తే షాక్!

Meerut: పామును అద్దెకు తెచ్చి భర్తను హతమార్చిన భార్య.. అసలు విషయం తెలిస్తే షాక్!

మీరట్‌ అక్బర్‌పూర్‌ సదాత్‌ గ్రామానికి చెందిన అమిత్‌కు రవిత అనే యువతితో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అమిత్‌ కూలీ పని చేస్తూ ఇంటిని నడుపుతున్నాడు. భార్య రవిత ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో రవితకు, అమర్‌జీత్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. దీంతో రవిత ఏడాది కాలంగా ఆ యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. భార్య నడుపుతున్న వ్యవహారం గురించి అమిత్‌కు తెలిసింది. దీంతో అమిత్ రవితను మందలించాడు. అయినా రవిత తన తీరును మార్చుకోలేదు.. దీంతో భార్య భర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. భర్త ఉంటే తమకు ఎప్పటికైనా అడ్డు తగులుతాడని భావించిన భార్య ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. ప్రియుడితో కలిసి భర్త గొంతు నులిమి హత్య చేసింది. వారిపై అనుమానం రాకుండా పాము కాటుతో భర్త చనిపోయినట్టు క్రియేట్ చేసింది.

ప్రియుడి సహాయంతో ఓ పామును అద్దెకు తెచ్చింది. అమిత్‌ మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టి పక్కనే ఆ పామును వదిలి పెట్టింది. పాము కాటు వల్లే అమిత్‌ చనిపోయాడని అందరూ నమ్మేలా ప్రచారం చేసింది. ఉదయం పాములు పట్టే వ్యక్తిని తీసుకొచ్చి పామును అక్కడి నుంచి తొలగించింది. దీంతో నిజంగానే అమిత్‌ పాముకాటుతో చనిపోయాడని స్థానికులు నమ్మారు. అమిత్ మృతదేహం నుంచి పామును తొలగిస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.

ఇక్కడే అసలు ట్విస్ట్‌ బయటకొచ్చింది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ చూసిన పోలీసులు షాక్ అయ్యారు. అమిత్ పాము కాటుతో చనిపోలేదని. శ్వాస అందక చనిపోయినట్టు పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు అమిత్‌ భార్యను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో రవితతో పాటు ఆమె ప్రియుడు అమర్‌జీత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి….

Exit mobile version