
Masoud Pezeshkian: జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఖండించారు. ఈ మేరకు ఆయన శనివారం భారత ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదాన్ని సమర్థించలేమని ఇరు దేశాధినేతలు ఈ సంభాషణలో స్పష్టం చేశారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానికి వ్యతిరేకంగా పోరాడాలన్న తమ ఉమ్మడి సంకల్పాన్ని ఇరు నేతలు పునరుద్ఘాటించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ప్రధాని మోదీకి ఫోన్ చేసి జమ్మూకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. బాధితులకు సంతాపాన్ని తెలియజేశారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఉగ్రవాద చర్యలకు ఎలాంటి సమర్థన ఉండదని..మానవత్వంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి నిలబడాలని నేతలు అంగీకరించినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది.
పహల్గామ్ దాడి పట్ల దేశ ప్రజల తీవ్ర విచారం..ఆగ్రహాన్ని ప్రధానిమోదీ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఈ హింసకు బాధ్యులైనవారిపై వారికి మద్దతిస్తున్న వారిపై భారత్ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అదే సమయంలో ఇరాన్ లోని బందర్ అబ్బాస్ లో జరిగిన పేలుడులో ప్రాణనష్టం జరగడం పట్ల ప్రధాని మోదీ సంతాపాన్ని తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.