- మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకుంటే ‘‘వివాహం’’ రక్షణ కాదు..
- పోక్సో చట్టంపై మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు..
- నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష..

Madras High Court: పోక్సో చట్టం కింద నిందితుడు మైనర్ బాలికతో లైంగిక నేరానికి పాల్పడితే ‘‘వివాహం’’ ఎలాంటి రక్షణ ఇవ్వదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. 22 ఏళ్ల వ్యక్తి 17 ఏళ్ల బాలికతో లైంగిక సంబంధం పెట్టుకున్న కేసును విచారించిన కోర్టు, అతడికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టులో విచారణ సమయంలోనే బాలిక అతడికి భార్యగా మారింది.
ఈ కేసుపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ‘‘పోక్సో చట్టంలో 18 ఏళ్ల వయసులోపు వారికి సమ్మతి అనే ప్రశ్నే లేదని చాలా స్పష్టంగా పేర్కొంది’’ అని కోర్టు పేర్కొంది. ‘‘నిందితుడు బాధితురాలి తర్వాత వివాహం చేసుకోవడం వల్ల ఆమె బాల్యంలో చేసిన నేరానికి విముక్తి లభించదు. అలాంటి రక్షణను అంగీకరిస్తే పోక్సో చట్టం ఉద్దేశమే దెబ్బతింటుంది’’ అని ధర్మాసనం పేర్కొంది.
Read Also: TGSRTC Strike: భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ సమ్మెపై పునరాలోచించాలి.. మంత్రి విజ్ఞప్తి
ఈ కేసులో నిందితుడైన వ్యక్తి, అమ్మాయి ఇరుగుపొరుగు ఇంటి వారు. వీరిద్దరు ప్రేమించుకున్నారు. బాలిక తల్లిదండ్రులు ఈ సంబంధం గురించి తెలుసుకున్నప్పుడు రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత, అమ్మాయి తల్లిదండ్రులు ఆమెకు వేరే వ్యక్తితో వివాహం ఏర్పాటు చేశారు. ఈ పెళ్లిని వ్యతిరేకించిన అమ్మాయి, నిందితుడితో కలిసి కర్ణాటక మైసూరు పారిపోయారు. అమ్మాయి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టడంతో, తిరిగి స్వస్థలానికి వచ్చారు.
కేసు విచారణలో భాగంగా, నిందితుడు తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నట్లు బాలిక ఒక మహిళా పోలీస్ అధికారికి వెల్లడించింది. ఈ సంఘటన సమయంలో ఆమె మైనర్ అని హైకోర్టు పేర్కొంటూ, పోక్సో చట్టం ప్రకారం బాలిక మైనర్ కావడంతో ఆమె లైంగిక చర్యకు సమ్మతించిన, దానిని సమ్మతిగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. ఇలాంటి నేరాలను కేవలం ఒక వ్యక్తిపై నేరంగా కాకుండా, సమాజంపై నేరాలుగా పరిగణించాలని కోర్టు చెప్పింది.