-
బహిరంగంగా స్పష్టం చేయండి
-
మంద కృష్ణ మాదిగ డిమాండ్
-
చంద్రబాబుకు, జగన్‌కు ఆకాశానికి, భూమికి మధ్య ఉన్నంత తేడా
గుంటూరు(తూర్పు), మార్చి 22(ఆంధ్రజ్యోతి): ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగ న్ బహిరంగంగా వెల్లడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణను వైసీపీ ఒక సామాజిక న్యాయంగా చూస్తోందా? లేక దళితుల మధ్య చిచ్చుగా భావిస్తోందా? అని నిలదీశారు. ఇటీవల ఏపీ శాసనసభలో వర్గీకరణ అంశంపై జరిగిన చర్చపై తన వైఖరిని చెప్పదలుచుకొంటే నేరుగా జగనే చెప్పాలని స్పష్టం చేశారు. కీలకమైన వర్గీకరణ బిల్లుపై ఇప్పటి వరకు జగన్ మాట్లాడలేదని, కనీసం అసెంబ్లీకి కూడా రాకపోవడం చూస్తే మాదిగలపై ఆయనకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తేటతెల్లం అవుతోందన్నారు. వైసీపీలో మాలల ఆధిపత్యం కోసం మాదిగలను జగన్ అణగదొక్కుతున్నారని అన్నారు. గుంటూరులో శనివారం మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. జగన్ వైఖరిపై ధ్వజమెత్తారు. ‘‘మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో మీరు రాసిన స్ర్కిప్టు ని చదివించారా? అన్న అనుమానం కలుగుతోంది. ఎస్సీ వర్గీకరణని ఓ చిచ్చుగా పార్టీలో మాదిగ నేతతోనే మాట్లాడిస్తున్నారు. మీరు సీఎం హోదాలో ఈ అంశాన్ని ఒక చిచ్చు గా అభివర్ణిస్తూ అసెంబ్లీలో ప్రకటన చేశారు. మా కన్నును మా చేతే పొడిపించి మీ పార్టీలో ఉన్న మాదిగ జాతి నేతలపై మాదిగలే ఈసడించుకునే పరిస్థితిని మీరే కల్పిస్తున్నారు. మాలల ఆధిపత్యానికి ప్రాధాన్యం ఇచ్చే విధంగా, మాదిగలను మాదిగలే గౌరవించకుండా మీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై స్పష్టత విషయంలో మీకు, సీఎం చంద్రబాబుకు ఆకాశానికి, భూమికి మధ్య ఉన్నంత తేడా ఉంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో స్పష్టత, నిజాయితీ, నిబద్ధత బాబుకే ఉన్నాయి.
మీ నేతల మాటలు చూస్తే.. మీరు వ్యతిరేకమే
గుంటూరులో మాలల మహాగర్జన తరువాత మాలలతో సమావేశం ఏర్పాటు చేశారు. అప్పట్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న మేరుగు నాగార్జున మాలలకు పెద్దపీట వేస్తానని ప్రకటన చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలే దు?. జూపూడి ప్రభాకరరావు ఎస్సీ వర్గీకరణ జరగనివ్వబోమని మాట్లాడుతున్నారు. దీనిని బట్టే మీరు మాదిగలకు వ్యతిరేకమన్న విషయం స్పష్టమవుతోంది. నాడు మాలలతో సమావేశం పెట్టించిన మీరు.. మాదిగ నాయకులతో ఎందుకు ఏర్పాటు చేయలేదు?. వైసీపీ తొలి ప్లీనరీలో వర్గీకరణకు మద్దతుగా తీర్మానం చేశారు. ఇప్పుడు ఈ విషయంలో మాట తప్పి, మడమ తిప్పారని మండిపడ్డారు.
జగన్‌లో సానుకూలత ఏదీ?
చంద్రబాబు రేపో, మాపో ఆర్డినెన్స్ తీసుకు రాబోతున్నారు. 1996లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నారు. ఈ తరుణంలో మీరు సానుకూలంగా లే కుండా, నేరుగా మాట్లాడకుండా మాదిగ నాయకులతోనే మాట్లాడిస్తుంటే మా విషయంలో మీరు ప్ర మాదకరంగా ఉన్నట్లు అనుమానాలు వస్తున్నాయి.
Updated Date – Mar 23 , 2025 | 04:32 AM