Manchu Manoj: కోర్టులో మోహన్‌బాబుకు చుక్కెదురు

Written by RAJU

Published on:

  • ఆయనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు కొట్టివేత?

  • తప్పిదానికి పాల్పడిన కోర్టు క్లర్క్‌కు మెమో జారీ

  • జల్‌పల్లి నివాసం వద్ద మంచు మనోజ్‌ ధర్నా

  • కోర్టు చెప్పినా తనని ఇంట్లోకి రానివ్వడం లేదని ఆవేదన

హైదరాబాద్‌ సిటీ, పహాడిషరీఫ్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌ బాబు కుటుంబంలో రేగిన వివాదం చల్లారడం లేదు. జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసం వద్ద ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్‌ బుధవారం ధర్నాకు దిగారు. మనోజ్‌ ఈ సందర్భంగా తన తండ్రి మోహన్‌బాబు, సోదరుడు విష్ణుపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనని ఇంట్లోకి రానివ్వకూడదని మోహన్‌బాబు కోర్టును తప్పుదారి పట్టించి స్టే తెచ్చుకున్నారని విలేకరులతో అన్నారు. తాను ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతినిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎల్‌బీనగర్‌ కోర్టులో చూపుగా.. ఎల్‌బీనగర్‌ న్యాయస్థానం ఆ స్టేను కొట్టేసిందని తెలిపారు. జల్‌పల్లిలోని ఇంటి విషయంలో చిన్న కొడుకు మనోజ్‌తో వివాదం నేపథ్యంలో మోహన్‌బాబు ఎల్‌బీనగర్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మనోజ్‌ తనను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, అతను తన ఇంట్లోకి ప్రవేశించకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.

ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం మోహన్‌బాబుకు అనుకూలంగా గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఇంట్లోకి ప్రవేశించేందుకు హైకోర్టు మనోజ్‌కు అనుమతి ఇచ్చిందనే విషయాన్ని దాచడంతోపాటు, తప్పుడు ఆధారాలు సమర్పించి మోహన్‌బాబు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని మనోజ్‌ తరఫున న్యాయవాదులు ఎల్‌బీనగర్‌ కోర్టులో వాదనలు వినిపించారు. వాటిని పరిశీలించిన ఎల్‌బీనగర్‌ న్యాయస్థానం మోహన్‌బాబుకు అనుకూలంగా ఇచ్చిన ఆదేశాలను మంగళవారం కొట్టేసినట్టు తెలిసింది. అంతేకాక ఈ తప్పిదం జరగడానికి కారణమైన కోర్టు క్లర్క్‌కు మెమో కూడా జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంచు మనోజ్‌ జల్‌పల్లి నివాసంలోకి వెళ్లేందుకు బుధవారం ప్రయత్నించగా మోహన్‌బాబు సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్‌ ఇంటి గేటు వద్ద గంటన్నరకు పైగా బైఠాయించి నిరసనకు దిగారు.

మనోజ్‌ భార్య భూమా మౌనిక కూడా అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా మనోజ్‌ విలేకరులతో మాట్లాడుతూ ఇంట్లో ఉండేందుకు హైకోర్టు తనకు అనుమతి ఇచ్చిందని, కానీ తన తండ్రి ఎల్‌బీనగర్‌ కోర్టును తప్పుదారి పట్టించి స్టే తెచ్చుకున్నారని ఆరోపించారు. తాను దాన్ని కోర్టులో నిరూపించడంతో స్టేను తొలగించిందన్నారు. అయినా తనని ఇంట్లోకి రానివ్వడం లేదని వాపోయారు. తన వస్తువులను ధ్వంసం చేయడంతోపాటు వాహనాలను దొంగతనం చేశారని ఆరోపించారు. పోలీసు కమిషన్‌ బైండోవర్‌ను తన సోదరుడు విష్ణు చాలాసార్లు అతిక్రమించాడని తెలిపారు. ఆస్తి వద్దని తన తండ్రికి ఎప్పుడో చెప్పానని, డిసెంబరు నుంచి గొడవలు జరుగుతుంటే పోలీసులు ఇప్పటిదాకా ఒక్క చార్జిషీట్‌ ఫైల్‌ చెయ్యలేదని మనోజ్‌ అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా

ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

గుడికి వెళ్తున్నారా.. ఇవి పాటించండి..

For More AP News and Telugu News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights