అందాన్ని రెట్టింపు చేయడంలో కాటుకదే పైచేయి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సొగసైన కళ్లు కాటుక పూస్తే వచ్చే అందమే వేరు. కళ్లకు కాటుక పెట్టకుండా మేకప్ పూర్తి అయిందని చెప్పలేరు. అందుకే కళ్లకు కాజల్ అప్లై చేయకుండా బయట అడుగుపెట్టరు అమ్మాయిలు. అందాన్ని రెట్టింపు చేసే కాటుక కళ్ల వెనక ప్రమాదమూ దాగుంది. అందుకే రోజూ కాటుక పెట్టుకునే అలవాటు ఉన్నవాళ్లు ఇది తప్పక తెలుసుకోవాలి. ఈ విషయంలో ఏమరుపాటుగా ఉంటే మీ కళ్లకు వచ్చే సమస్య నుంచి తప్పించుకోవడం కష్టమని హెచ్చరిస్తున్నారు చర్మనిపుణులు..
మన అమ్మమ్మల నాటి కాలంలో కాటుకను స్వచ్ఛమైన ఆముదం, నెయ్యి ఉపయోగించి ఇళ్లలోనే తయారుచేసేవారు. ఈ కాటుక మలినాలు పోగొట్టి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది కాబట్టే కాటుక కళ్లకు చాలా మంచిది. చలువ చేస్తుంది అనేవారు. అందంగా కనిపించేలా చేయడం అదనపు ప్రయోజనం. కానీ, ఇప్పుడు మనం వాడేవన్నీ లెడ్, నిల్వ కోసం ఉపయోగించే పారాబెన్స్ వంటి రసాయనాలతో తయారైనవే. ఈ తరహా కాటుకలు రోజూ కళ్లకు అప్లై చేయడం వల్ల మెదడు, ఎముకల్లోకి ఇంకి అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. రక్తహీనత, కనురెప్పల్లో నూనె గ్రంథులు తగ్గి అలర్జీలు, కార్నియల్ అల్సర్లు, గ్లకోమా వంటివి సోకుతాయి. పిల్లలకు ఇవి మరీ చేటు చేస్తాయని డెర్మటాలజిస్టులు చెబుతున్నారు.
ఈ సమస్య రాకుండా జాగ్రత్తపడండి..
మేకప్ వేసుకోవడం ప్రమాదం కాదు. దానిని సరిగా తొలగించకపోవడం వల్లే అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. ఏ రకమైన మేకప్ వేసుకున్నా ఇదే సూత్రం వర్తిస్తుందని సూచిస్తున్నారు డెర్మటాలజిస్ట్‌లు. కాటుక విషయంలోనూ అంతే. అరుదుగా వేసుకునేవారైనా ఈ జాగ్రత్తలు పాటించకపోతే కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడే ఛాన్స్ ఉంది.
-
కళ్లను తరచూ రుద్దడం వల్ల కాటుక నేరుగా మీ చర్మంలోని పై పొరల ద్వారా లోపలికి ఇంకే ప్రమాదం ఎక్కువ. ఇది చాలా హానికరం.
-
మీకు పెరి-ఆర్బిటల్ ఎగ్జిమా లేదా డెర్మటైటిస్ (కనురెప్పలు లేదా చర్మం వాపు ) ఉన్నట్లయితే కాజల్‌ను అప్లై చేసినపుడు నల్లటి వలయాలు ఏర్పడవచ్చు.
-
చర్మంపై ప్రతికూల ప్రభావాలను నివారించాలంటే సహజమైన కాటుక ఉపయోగించేందుకు ప్రయత్నించండి. రసాయనాలతో కూడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులు చర్మానికి హాని కలిగిస్తాయి.
-
కళ్ల చుట్టూ ఉన్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఎక్కువ రసాయనాల గాఢత కలిగిన ఉత్పత్తులకు దూరం పెడితేనే శ్రేయస్కరం.
-
కాటుక స్థానంలో ఐలైనర్, మస్కారా, ఐషాడో వంటివి వాడితే కంటిలోకి రసాయనాలు అంత సులువుగా పోలేవు. క్లీన్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త.