
నిమ్మకాయలు అనగానే మనకు సాధారణంగా పులుపు రుచి, ఆరోగ్య ప్రయోజనాలే గుర్తుకు వస్తాయి. కానీ, వాటి తొక్కలు కూడా ఎంతో ఉపయోగకరం అని మీకు తెలుసా? ఇంటిని సుగంధమయం చేయడం దగ్గరి నుంచి శుభ్రపరచడం వరకు, వంటల్లో రుచిని పెంచడం నుండి పానీయాలకు స్వచ్ఛత జోడించడం వరకు నిమ్మ తొక్కలు ఒక సహజమైన ఆప్షన్. నిమ్మకాయలను మాత్రమే కాదు నిమ్మతొక్కలతో కూడా అనేక రకాల ప్రయోజనాలున్నాయి. అవేంటి వీటిని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
రూమ్ ఫ్రెష్‌నర్ గా..
పెద్ద పెద్ద హోటళ్లలో అడుగుపెట్టగానే ఓ మంచి సువాసన మనసుకు హాయిగా తగులుతుంది. అచ్చం ఇలాంటి అనుభూతినే మీరూ అనుభవించొచ్చు. అది కూడా రూపాయి ఖర్చు లేకుండా.. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక చిన్న మట్టి కుండలో నిమ్మ తొక్కలను వేసి, దానికి కొన్ని చుక్కల రోజ్‌మేరీ నూనె లేదా దాని బెరడు ముక్కను జోడించండి. దీన్ని స్టవ్ మీద కాసేపు వేడి చేయండి. ఈ ప్రక్రియలో వెలువడే సహజ సుగంధం మీ ఇంటి అంతటా వ్యాపిస్తుంది. అంతేకాక, నిమ్మ తొక్కలను ఎండబెట్టి, పొడిగా చేసి చిన్న సంచుల్లో వేసి ఉంచితే, ఆ ప్రదేశాలు ఎల్లప్పుడూ సుగంధంగా ఉంటాయి.
శుభ్రతకు సహజ ఏజెంట్
నిమ్మ తొక్కల్లో ఆమ్ల యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల అవి శుభ్రపరిచే ఏజెంట్‌గా అద్భుతంగా పనిచేస్తాయి. ఒక కూజాలో నిమ్మ తొక్కలను వేసి, వైట్ వెనిగర్‌ను వేయండి. దీన్ని మూతపెట్టి రెండు వారాల పాటు ఉంచండి. ఈ సమయంలో వెనిగర్ నిమ్మ నూనెను గ్రహించి, శక్తివంతమైన శుభ్రపరిచే లిక్విడ్ గా మారుతుంది. దీన్ని ఒక స్ప్రే బాటిల్‌లో వేసి, సగం నీటితో కలిపి మీ క్యాబినెట్‌లు, సింక్, గాజు సామాన్లను శుభ్రం చేయండి. ఇది కెమికల్స్ లేని ఆహ్లాదకరమైన సుగంధాన్ని కూడా అందిస్తుంది.
వంటల్లో రుచి కోసం
నిమ్మ తొక్కలను బాగా ఎండబెట్టి, పొడిగా రుబ్బుకుంటే అద్భుతమైన సుగంధ పొడి తయారవుతుంది. దీన్ని సలాడ్లు, ఉడికించిన కూరగాయల్లో చల్లుకోవడం ద్వారా వంటలకు ప్రత్యేక రుచి జోడించవచ్చు. అలాగే, మైక్రోవేవ్ శుభ్రత కోసం ఒక గుప్పెడు నిమ్మ తొక్కలను నీటితో కలిపి, మైక్రోవేవ్‌లో 3 నిమిషాలు వేడి చేయండి. ఇది ఓవెన్ లోపలి మరకలను తొలగించి, స్పాంజితో సులభంగా శుభ్రం చేయడానికి సహాయపడుతుంది.
సుగంధ పానీయాలు
నిమ్మ తొక్కలను పానీయాల్లో కూడా ఉపయోగించవచ్చు. టీ తయారుచేసేటప్పుడు ఒక నిమ్మ తొక్క ముక్కను జోడిస్తే రుచి రెట్టింపవుతుంది. ఇతర జ్యూస్‌లలో కలిపినా ఆహ్లాదకరమైన రుచి వస్తుంది. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి, ఒక కుండ నీటిలో నిమ్మ తొక్కలను వేసి, సుగంధంతో కూడిన ఆరోగ్యకరమైన నీటిని తాగవచ్చు. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.