
ఖమ్మం జిల్లా కూసుమంచిలోని డీసీసీబి బ్యాంకులో రుణం తీసుకున్నాడు ఓ వ్యక్తి. అతను లోన్ సకాలంలో చెల్లించకపోవడంతో మేనేజర్ అప్పు కింద అతని వద్ద ఉన్న గొర్రెలు తీసుకురావడం కలకలం రేపింది. గతంలో కిస్తీలు చెల్లించలేదని.. బ్యాంకుల వాళ్లు ఇళ్ల దర్వాజాలు, కిటికీలు తీసుకెళ్లిన వైనం చూసాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటిమీద పడి గొర్రెలను తీసుకెళ్లిన ఘటన జరగ్గా, విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కూసుమంచి మండలం గోరిలపాడు తండాకు చెందిన బానోత్ లింగా అనే యువకుడు కూసుమంచి డీసీసీబీ బ్యాంకులో 50,000 వేల రూపాయలు ముద్ర లోన్ తీసుకున్నాడు. గత కొద్దికాలంగా ఇంట్లో పెద్దలకు ఆరోగ్య అవసరాల కోసం డబ్బులు ఖర్చులు కాగా.. గత ఆరు నెలలుగా ఈఎంఐలు చెల్లించడం లేదు. దీంతో డీసీసీబీ బ్యాంకు లేడీ మేనేజర్.. తమ సిబ్బందితో లింగా ఇంటికి వెళ్లి అప్పు కింద అతని వద్ద ఉన్న గొర్రెలను తీసుకెళ్లింది. దీంతో బాధితుడు మరోచోట అప్పు చేసి 10వేల రూపాయిలు కట్టడంతో గొర్రెలను బాధితుడు ఇంటికి తరలించారు. వరసగా ఉగాది, రంజాన్ సెలవులు ఉండటంతో విషయం బయటకు రాలేదు. డీసీసీబీ మేనేజర్ నిర్వాకంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడా బాబులు వేలు కోట్లు నొక్కేసి.. విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంటే ఏం చేయలేని బ్యాంకుల వాళ్లు.. పేద, మధ్యతరగతి వర్గాలపై ఈ రకంగా దాష్టీకం ప్రదర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి