ABN
, Publish Date – Apr 18 , 2025 | 05:22 AM
పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే నీటిలో 45 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలని ట్రైబ్యునల్ ముందు వాదించింది. బచావత్ ట్రైబ్యునల్ పేరుతో ఎగువ రాష్ట్రాలకు లబ్ధి కలిగిందని పేర్కొంటూ తెలంగాణ పక్షం స్పష్టమైన దృక్కోణం వెల్లడించింది.

బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ముందు తెలంగాణ వాదన
సాగర్ ఎగువ రాష్ట్రాలకు బచావత్ ట్రైబ్యునల్
వెసులుబాటు కల్పించిందని వ్యాఖ్య
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు అనుమతి లభిస్తే దాని నుంచి కృష్ణా డెల్టా సిస్టమ్ (కేడీఎస్)కు తరలించే కృష్ణా జలాల్లో 45 టీఎంసీల నీటిని నాగార్జున సాగర్ ఎగువ రాష్ట్రంగా తెలంగాణకు కేటాయించాలని జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ (కృష్ణా ట్రైబ్యునల్-2) ముందు తెలంగాణ వాదించింది. పోలవరం ప్రాజెక్టు నుంచి కేడీఎస్‌కు తరలించే 80 టీఎంసీల నీటికి బదులు నాగార్జున సాగర్ ఎగువ రాష్ర్టాలు 80 టీఎంసీల కృష్ణా జలాల వాడుకోవడానికి బచావత్ ట్రైబ్యునల్ వెసులుబాటు కల్పించిందని గురువారం తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదించారు. కృష్ణా జలాల్లో మిగతా 35 టీంఎసీల నీటి వినియోగానికి ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయని తెలిపారు. కనుక మిగతా 45 టీఎంసీలపై తెలంగాణకే పూర్తి హక్కు ఉంటుందని పేర్కొన్నారు. ఇక, పోలవరం కుడికాలువ నుంచి 10వేల క్యూసెక్కుల నీటి తరలింపునకు గోదావరి ట్రైబ్యునల్(బచావత్) అనుమతించిందని సీఎస్ వైద్యనాథన్ పేర్కొన్నారు.
ఆ తర్వాత 17,500 క్యూసెక్కులకు.. తాజాగా 40 వేల క్యూసెక్కులకు కాలువ సామర్థ్యాన్ని పెంచారని నివేదించారు. పోలవరం ప్రాజెక్టు విస్తరణలో భాగంగా రూ.80వేల కోట్లతో గోదావరి – బనకచర్ల అనుసంధానానికి ఏపీ ప్రభుత్వం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని గుర్తుచేసిన తెలంగాణ.. ఇందుకు ఏపీ సర్కారు జారీచేసిన జీవోను ట్రైబ్యునల్‌కు అందించింది. యేటా గోదావరి నది నుంచి సముద్రంలో కలుస్తున్న 3000-4000 టీఎంసీల నీటిని బనకచర్ల, చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల పథకాలతో సాగర్ కుడికాలువతోపాటు కృష్ణా డెల్టా సిస్టమ్‌లోని ఎడమ కాలువ పరిధిలోని ఏపీ ప్రాంత చివరి ఆయకట్టుకు నీరు అందించే అవకాశాలున్నాయని వైద్యనాథన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఒకటో, రెండో పంటలకు కృష్ణా జలాల్లో ఎక్కువ నీటిని వాడుకుని ఇతర బేసిన్‌లకు మళ్లించాలనుకుంటే లోటు ఉన్న కృష్ణా బేసిన్ నుంచి కాకుండా గోదావరి జలాల నుంచి తరలించేలా చూడాలని కోరారు.
Updated Date – Apr 18 , 2025 | 05:22 AM