KIMS Hospital: శ్రీతేజ.. ఎవరినీ గుర్తుపట్టడం లేదు!

Written by RAJU

Published on:

  • న్యూరో రిహాబిలిటేషన్‌ కేంద్రానికి బాలుడు

  • అక్కడ చికిత్సతో మెదడు స్పందించే అవకాశం

  • నోటి ద్వారా ఆహారం.. వెంటిలేటర్‌ అవసరం లేదు

  • కిమ్స్‌ వైద్యుల వెల్లడి.. ఆ ఆస్పత్రిలో 5నెలల చికిత్స

  • 10శాతమే కోలుకున్నాడు.. చెల్లినీ గుర్తుపట్టడం లేదు: తండ్రి భాస్కర్‌

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి.. అప్పటి నుంచి కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎనిమిదేళ్ల బాలుడు శ్రీతేజను మంగళవారం రాత్రి వైద్యులు డిశ్చార్జి చేశారు. బాబుకు ఆస్పత్రిలో అవసరమైన అన్ని చికిత్సలూ పూర్తయ్యాయని.. నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నాడని.. కృత్రిమ ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ అవసరం లేదని వైద్యులు చేతన్‌, విష్ణు పేర్కొన్నారు. శ్రీతేజను ఫిజియోథెరపీ కోసం ప్యారడైజ్‌ సమీపంలోని న్యూరో రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు తరలించారు. డిసెంబరు 4న పుష్ప-2 ప్రిమియర్‌ షో చూసేందుకు తల్లిదండ్రులు, చెల్లితో కలిసి శ్రీతేజ సంద్య థియేటర్‌కు వచ్చాడు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో తల్లి రోహిణి అక్కడిక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితికి చేరుకున్న శ్రీతేజను కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు.

ఆ ఆస్పత్రిలో బాబు 4 నెలలు 25 రోజుల పాటు చికిత్స పొందాడు. శ్రీతేజ ప్రాణాపాయం నుంచి బయటపడినా పూర్తిగా కోలుకోలేదని కుటుంబసభ్యులు చెప్పారు. బాలుడి ఆరోగ్యం కేవలం 10శాతమే మెరుగుపడిందని తండ్రి భాస్కర్‌, బాబాయి మల్లికార్జున్‌ మంగళవారం మీడియా ఎదుట వివరించారు. బాలుడు కళ్లు తెరిచి చూస్తున్నా.. ఎవరినీ గుర్తుపట్టడం లేదని చెప్పారు. ఐసీయూలో ఉన్నప్పుడు శ్రీజ వద్దకు చెల్లి వెళ్లి పలకరించినా, బాబులో స్పందన లేదని తండ్రి భాస్కర్‌ వాపోయాడు. ఇరవై రోజుల నుంచి శ్రీతేజ ఆరోగ్యం నిలకడగా ఉందని.. రెండు వారాల క్రితం ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి తరలించారని చెప్పాడు.

ఆస్పత్రిలోనే ఉంటే ఇన్‌ఫెక్షన్లు వస్తాయని, రిహాబిలేటేషన్‌ సెంటర్‌కు తీసుకుపోతే మంచిదని.. అక్కడ చికిత్సతో మెదడు స్పందించే అవకాశం ఉంటుందని వైద్యులు సూచించారని వెల్లడించారు. బాలుడికి రెండు నెలల పాటు ముక్కు ద్వారా ద్రవాహారం అందించారని, తర్వాత పొట్టకు సర్జరీ చేసి పైపు, ఇతర పరికరాలు అమర్చి ఆహారం అందిస్తున్నారని చెప్పాడు. బాబును ఎలా సంరక్షించుకోవాలి? అనే విషయమ్మీద వైద్యులు, సిబ్బంది తమకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని చెప్పాడు. శ్రీతేజకు మెరుగైన చికిత్స కోసం సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి, పుష్ప సినిమా బృందం సహకరించారని చెబుతూ కృతజ్ఞతలు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు

PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ

Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్

For Telangana News And Telugu News

Leave a Comment

Subscribe for notification
Verified by MonsterInsights