ABN
, Publish Date – Apr 09 , 2025 | 05:22 AM
క్షయ (టీబీ) వ్యాధి నిర్ధారణకు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ వినియోగించి సత్ఫలితాలు సాధించారు.

కిమ్స్ ఆస్పత్రి మరో ముందడుగు
క్యూఎక్స్‌ఆర్ అనే ఏఐ టూల్‌తో 16,675 మంది ఎక్స్‌రేల విశ్లేషణ
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): క్షయ (టీబీ) వ్యాధి నిర్ధారణకు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్ వినియోగించి సత్ఫలితాలు సాధించారు.క్యూఎక్స్‌ఆర్ అనే అత్యాధునిక ఏఐ టూల్ మానవ ప్రమేయం లేకుండా ఛాతీ ఎక్స్‌రేలను విశ్లేషించి, కచ్చితత్వంతో వ్యాధిని నిర్ధారించిందని కిమ్స్ పల్మోనాలజీ విభాగాధిపతి డాక్టర్ లతాశర్మ తెలిపారు. ఆ ఫలితాలను రేడియాలజిస్టులు పరిశీలించి, వాటి కచ్చితత్వాన్ని నిర్ధారించారని చెప్పారు. ఏఐ టూల్ మొత్తం 16,675మంది ఛాతీ ఎక్స్‌రేలను విశ్లేషించింది. వారిలో క్షయ సోకినవారిని గుర్తించడంలో 88.7 శాతం కచ్చితత్వం ప్రదర్శించింది. క్షయలేని వారిని గుర్తించడంలో ఇంకా మెరుగ్గా 97 శాతం ఫలితాలు సాధించింది. ముందుగా ఏఐ వినియోగించి టీబీని గుర్తించారు. ఆ తర్వాత ఆ కేసులు అన్నింటినీ నిపుణులైన రేడియాలజిస్టులు కూడా పరిశీలించారు.
ఏఐ టూల్ స్పెసిఫిసిటీ 69.1 శాతంగా ఉంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన ప్రమాణాలను అందుకుంటోందని డాక్టర్ లతా శర్మ వివరించారు. సంప్రదాయ రేడియోగ్రఫీతో దాన్ని నిర్ధారించడానికి ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో ఏఐ టూల్ మెరుగైన ప్రత్యామ్నాయం అవుతుందని పేర్కొన్నారు. సీనియర్ రేడియాలజిస్టు డాక్టర్ చైతన్య ఇసమళ్ల మాట్లాడుతూ మానవ నైపుణ్యానికి ఏఐ ప్రత్యామ్నాయం కాలేదు గానీ, ప్రాథమిక పరీక్షల విషయంలో ఆధారపడదగిన సాధనంగా ఉంటుందన్నారు. క్యూఎక్స్‌ఆర్ లాంటి ఏఐ టూల్స్ అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడంతో టీబీని త్వరగా గుర్తించి, చికిత్సలో మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయన్నారు.
Updated Date – Apr 09 , 2025 | 05:22 AM