కేబీఆర్ పార్కు చుట్టూ ఆస్తుల సేకరణ వ్యయం.. సూత్రప్రాయంగా అంచనా వేసిన జీహెచ్‌ఎంసీ
హైదరాబాద్ సిటీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) పార్కు చుట్టూ వంతెనల నిర్మాణం ఖరీదైన ప్రాజెక్టుగా మారుతోంది. వంతెనలు, అండర్‌పా్‌సల నిర్మాణం కోసం ఆస్తుల సేకరణకే పెద్ద ఎత్తున నిధులు వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది.ఆస్తుల సేకరణ వ్యయం.. తొలుత అంచనా వేసిన దానికన్నా 62శాతం పెరగనుంది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు సూత్రప్రాయంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పార్కు చుట్టూ ఆరు ప్రాంతాల్లో వంతెనలు, అండర్‌పా్‌సల నిర్మాణం, బంజారాహిల్స్ రోడ్ నంబర్-12 విస్తరణ కోసం 299 ఆస్తులను సేకరించాల్సి ఉంటుందని గుర్తించారు. ఇందుకు రూ.741 కోట్లు అవసరమని సూత్రప్రాయంగా అంచనా వేశారు. అయితే ఈ మొత్తంలో హెచ్చుతగ్గులు ఉండవచ్చని చెబుతున్నారు. తొలుత.. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఆస్తుల సేకరణకు రూ.455 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా.. ప్రస్తుతం అది రూ.741 కోట్లకు పెరిగింది. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపినట్టు ఓ అధికారి తెలిపారు.
హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ)లో భాగంగా.. సిగ్నల్ చిక్కులు లేని ప్రయాణం కోసం కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న ఆరు జంక్షన్లలో స్టీల్ వంతెనలు, అండర్‌పా్‌సలు నిర్మించనున్నారు. ఇందుకు రూ.1,090 కోట్ల ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో నిర్మాణ వ్యయం రూ.635 కోట్లు కాగా, ఆస్తుల సేకరణకు రూ.455 కోట్లు ప్రతిపాదించారు. తాజాగా ఆస్తుల సేకరణకు పెరిగిన వ్యయంతో మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.1376 కోట్లకు పెరగనుంది. అయితే రూ.635కోట్లతో పనులకు ఫిబ్రవరిలో జీహెచ్‌ఎంసీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం రూపొందించిన రహదారి అభివృద్ధి ప్రణాళిక (ఆర్‌డీపీ)లు ఇప్పటికే ఆమోదం పొందాయి. దీంతో ఏ మార్గంలో ఎన్ని ఆస్తులను సేకరించాలన్నది పట్టణ ప్రణాళికా విభాగం వర్గాలు గుర్తించాయి. బంజారాహిల్స్ విరించి ఆస్పత్రి నుంచి మహారాజా అగ్రసేన్ జంక్షన్ వరకు 3.1 కిలోమీటర్ల మేర, కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్న ఇతర జంక్షన్ల వద్ద కలిపి 299 ఆస్తులను, సుమారు 56,621 చదరపు గజాల స్థలాన్ని సేకరించాల్సి ఉంటుందని నిర్ధారించారు.
ఈ ప్రాంతాల్లో సబ్ రిజిస్ర్టార్ విలువ చదరపు గజానికి రూ.63వేల నుంచి రూ.93వేల వరకు ఉంది. భూసేకరణ చట్టం ప్రకారం దీనికి రెట్టింపు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. భవనాలు ఉంటే నిర్మాణ వ్యయం అదనంగా చెల్లించాలి. వీటిని పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. రూ.741కోట్లు అవసరమవుతాయని సూత్రప్రాయంగా అంచనా వేశారు. అభివృద్ధి బదలాయింపు హక్కుల(టీడీఆర్) ద్వారా ప్రస్తుతానికి పది శాతం ఆస్తులను సేకరించే అవకాశముందని పట్టణ ప్రణాళికావిభాగం భావిస్తోంది. ఆర్‌డీపీలో భాగంగా ఆస్తుల సేకరణపై గతంలో జీహెచ్‌ఎంసీ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఎలాంటి అభ్యంతరాలు, ఫిర్యాదులు రాలేదని ఆస్తుల సేకరణ విభాగం వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే.. ఆస్తుల యజమానులు మాత్రం తమ భూమికి చదరపు గజానికి రూ.4లక్షలు, నిర్మాణ విలువ రూ.8వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంత మొత్తం చెల్లించడం కుదరదన్న జీహెచ్‌ఎంసీ.. మధ్యే మార్గంగా సేకరణ వ్యయాన్ని అంచనా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు
Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
For Telangana News And Telugu News
Updated Date – Mar 25 , 2025 | 04:55 AM