– ఆలయాల్లో ప్రత్యేక పూజలు… పంచాంగ పఠనాలు
– మహాశక్తి ఆలయంలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
– యజ్ఞ వరాహ క్షేత్రంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్
కరీంనగర్ కల్చరల్, మే 30 (ఆంధ్రజ్యోతి): విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు నగరంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఆలయాల్లో, వాడవాడల్లో పంచాంగ పఠనాలు, ఉగాది పచ్చడి స్వీకరణలు, కవి సమ్మేళనాలు నిర్వహించారు. భక్తులు ఆలయాలను దర్శించి ఇంటిల్లిపాది చల్లగా ఉండాలని కోరుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలసి భోజనాలు చేశారు. ఆలయాల్లో, కూడళ్లలో, సామాజిక, ప్రచార, ప్రసార మాద్యమాల ద్వారా పంచాంగ శ్రవణం చేసి తమ భవిష్యత్ గురించి తెలుసుకున్నారు. అర్చకులు, పురోహితులను ఇళలకు ఆహ్వానించుకొని పంచాంగం చెప్పించుకున్నారు. ఏ ఇంట చూసినా ఆధ్యాత్మిక వాతావరణం, పండుగ ఆనందం కనిపించింది. చైతన్యపురి మహాశక్తి ఆలయంలో ఉదయం పచ్చడి వితరణ, సాయంత్రం పంచాంగ శ్రవణంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్, కుటుంబ సభ్యులు, మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, నాయకులు పాల్గొన్నారు. మంత్రి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ యేడు అందరికి కలసి రావాలని, సకల శుభాలు చేకూరాలన్నారు.
యజ్ఞ వరాహక్షేత్రంలో ఉస్మానియా, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జ్యోతిష విభాగ అధ్యక్షురాలు, జ్యోతిర్వాస్తు విజ్ఞాన మాస పత్రిక సంపాదకురాలు డాక్టర్ ఎస్ ప్రతిభ పంచాంగ పఠనం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కుటుంబ సభ్యులు, సర్వ వైదిక సంస్థానం ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ శ్రీభాష్యం వరప్రసాదశర్మ, సభ్యులు, మాజీ మాజీ ఎమ్మెల్యే వుచ్చిడి మోహన్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కోల మాలతి సంపత్‌రెడ్డి, గందె మహేశ్, బోనాల శ్రీకాంత్, ఒంటెల సత్యనారాయణరెడ్డి, ఏలేందర్‌యాదవ్, కర్ర సూర్య శేఖర్, కలర్ సత్తన్న పాల్గొన్నారు.
అశోక్‌నగర్ వాసవి కన్యకా పరమేవ్రి ఆలయంలో పారువెల్ల ఫణిశర్మ పంచాగ పఠనం చేయగా ఆలయ అధ్యక్ష కార్యదర్శులు చిట్టుమల్ల శ్రీనివాస్, కాచం రాజేశ్వర్, కోశాధిరకారి బొల్లం శ్రీనివాస్, సంకష్టి కన్వీనర్ రాచమల్ల భద్రయ్య, సభ్యులు పాల్గొన్నారు. భగత్‌నగర్ జడ్పీ క్వార్టర్స్ ఆవరణలోని ఆలయ సముదాయంలో జరిగిన వేడుకల్లో ఆలయ చైర్మన్ యాంగండ్ల అనిల్‌కుమార్, సభ్యులు, ఈఓ కొస్న కాంతారెడ్డి పాల్గొన్నారు. శ్రీపురంలో భక్తాంజనేయస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పంచాంగ పఠనం జరిగింది. శ్రీరాంనగర్ కాలనీ శ్రీరామ మందిరంలో సముద్రాల విజయసారథి పంచాంగ పఠనం చేయగా అధ్యక్ష కార్యదర్శులు డి మాధవరావు, గజవాడ ఆంజనేయులు, కోశాఽధికారి నరసింహాచార్య, సభ్యులు పాల్గొన్నారు. విద్యానగర్ రెడ్డి సంక్షేమ సంఘం భవనంలో వీఎస్‌ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ వి నరేందర్‌రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొని ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బీజేపి జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డె శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్డుపై నివసిస్తున్న పేదవారికి భక్ష్యాలను పంపిణీ చేశారు. 33వ డివిజన్‌లో హెలీప్యాడ్ గ్రౌండ్ ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో సత్యనారాయణశర్మ పంచాంగ పఠనం చేయగా మాజీ మేయర్ యాదగిరి సునీల్‌రావు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.