JNTU: జేఎన్‌టీయూలో.. పరిశోధనలకు ప్రాధాన్యం ఏదీ..

Written by RAJU

Published on:

– ఈ ఏడాది పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ విడుదల చేయని జేఎన్‌టీయూ అధికారులు

– అడ్మిషన్ల విభాగం చుట్టూ ఆశావహ అభ్యర్థుల చక్కర్లు

హైదరాబాద్‌ సిటీ: ఇంజనీరింగ్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌కు చిరునామాగా నిలిచిన జేఎన్‌టీయూ(JNTU)లో పరిశోధనలకు ప్రాధాన్యం లభిస్తుందా అంటే.. విద్యార్థి వర్గాల నుంచి లేదనే జవాబు వస్తోంది. ప్రతియేటా పీహెచ్‌డీ నోటిఫికేషన్లను జారీచేయడంలో అడ్మిషన్ల విభాగం అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది (2024) జనవరిలో పీహెచ్‌డీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ ఇవ్వగా, నిన్న మొన్నటి వరకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికాక పోవడంతో 40శాతం పైగా సీట్లు మిగిలిపోయాయి. మొత్తం 1,031మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వివిధ దశల్లో జాప్యం కారణంగా వందలాది మంది అభ్యర్థులు ప్రైవేటు యూనివర్సిటీల బాట పట్టారు. ఓవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఔత్సాహికులను విశ్వవిద్యాలయాలు ప్రోత్సహించాలని చెబుతున్నా, జేఎన్‌టీయూ అధికారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

నోటిఫికేషన్‌ ఎప్పుడిస్తారు?

పీహెచ్‌డీ ప్రవేశాల నిమిత్తం ఈ ఏడాది నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదల చేస్తారో ఎవరికీ అంతుబట్టడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకొని పార్ట్‌టైమ్‌, ఫుల్‌టైమ్‌ అడ్మిషన్ల కోసమని ఎదురుచూస్తున్న పలువురు అభ్యర్థులు నోటిఫికేషన్‌ ఎప్పుడిస్తారంటూ అడ్మిషన్ల విభాగం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల వైస్‌చాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించిన కిషన్‌కుమార్‌రెడ్డి(Kishan Kumar Reddy).. తాజాగా ప్రైవేటు కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో జరిపిన భేటీలో రీసెర్చ్‌ సెంటర్లకు పీహెచ్‌డీ సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ, నోటిఫికేషన్‌ జారీపై అర్‌అండ్‌డీ, అడ్మిషన్ల విభాగం నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ఆశావహ అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. పీహెచ్‌డీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ వెంటనే జారీచేయాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు వీసీని కోరుతున్నారు.

టీసీలు, పే స్లిప్పుల పేరుతో వేధించొద్దు

గతేడాది పీహెచ్‌డీ ప్రవేశపరీక్ష రాసి అర్హత సాధించిన అభ్యర్థులను ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లు(టీసీ), ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు వేతన స్లిప్పులు కావాలంటూ అడ్మిషన్ల విభాగం అధికారులు అర్థంపర్థం లేని నిబంధనలు పెట్టడంతో పదుల సంఖ్యలో అభ్యర్థులు ఇంటర్వ్యూలకు దూరమయ్యారు. కొన్ని విద్యార్థి సంఘాల నుంచి టీసీలు, పేస్లిప్పుల గురించి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గిన అధికారులు కొద్దిమందికి టీసీలు, పేస్లిప్పులు లేకున్నా ఇంటర్వ్యూలకు అనుమతించారు. విద్యార్థులను వేధింపులకు గురిచేసే నిబంధనలను తొలగించాలని కోరుతున్నారు. అడ్మిషన్ల సమయంలో టీసీలు కావాల్సిందేనని పట్టుపడుతున్న వర్సిటీ అధికారులు, పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి టీసీలు ఇచ్చేందుకు ససేమిరా అంటుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీహెచ్‌డీ అడ్మిషన్ల ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై వీసీ కిషన్‌కుమార్‌ రెడ్డి దృష్టి సారించాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నారు.

city7.2.jpg

ఈ వార్తను కూడా చదవండి: BJP victory: బీజేపీదే గెలుపు

ఈ వార్తను కూడా చదవండి: ఎస్సీ వర్గీకరణ.. బీసీ రిజర్వేషన్ల పెంపు!

ఈ వార్తను కూడా చదవండి: సీతారామ’తో ఖమ్మం జిల్లా సస్యశ్యామలం

ఈ వార్తను కూడా చదవండి: Heatwave: భానుడి భగభగలు

Read Latest Telangana News and National News

Subscribe for notification